దాదాపు పదేళ్ల పాటు ఆమెకు నరకం చూపిస్తున్నారు. శారీరక.. మానసిక వేధింపులతో ఆమెను ఆటబొమ్మలా వాడేసిన వైనం బయటకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 139 మంది చేతిలో అత్యాచారానికి గురైనట్లుగా చెబుతున్న యువతికి సంబంధించి విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వందకు పైగా పేజీల్లో తాను పడిన నరకం గురించి.. తనను దారుణంగా హింసించిన వారిపై పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
దీంతో.. విషయం బయటకు వచ్చి సంచలనంగా మారింది. అయితే..బాధితురాలిని డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తి బంధీగా చేసుకొని ఆట ఆడిస్తున్నట్లుగా చెబుతున్నారు. అతగాడికి సంబంధించి వివరాలు బయటకు రావాల్సి ఉంది. గాడ్ పవర్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న ఇతగాడి కార్యాలయంలో పోలీసులు తాజాగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలకమైన పత్రాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. పోలీసులకు బాధితురాలు కంప్లైంట్ ఇవ్వటానికి కాస్త ముందు.. సదరు మహిళను టార్చర్ పెట్టిన వారికి ఫోన్లు చేసి ఇష్యూను ‘సెటిల్’ చేసుకోవాల్సిందిగా కోరుతున్నట్లుగా చెప్పే ఆడియోలు బయటకు వచ్చాయి. బాధితురాలికి సాయం చేస్తానని మాయమాటలు చెప్పి..తన చెరలో పెట్టుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇతగాడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
డాలర్ భాయ్ మీద వివిధ జిల్లాల్లో ఇదే తరహాలో బెదిరింపులు.. బ్లాక్ మొయిలింగ్ కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. కన్సెల్టెన్సీ.. యాడ్ ఏజెన్సీల పేరుతో కొందరు మహిళలకు ఉద్యోగాల ఎర చూసి వారి సర్టిఫికేట్లు తమ వద్ద ఉంచుకొని బ్లాక్ మొయిల్ చేస్తారని చెబుతున్నారు. తాజాగా జరిపిన సోదాల్లో బెదిరింపులకుపాల్పడిన ఆడియోటేపుల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ముందు.. పోలీసులకు ఇచ్చే కంప్లైంట్ లో ఉన్న వారికి డాలర్ భాయ్..ఫోన్లు చేయటం.. వారిని డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ అంశంపైనా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు షురూ చేశారు.