తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్.. క్లారిటీతో ఉందా? ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నారా? ఆయన వ్యూహం ఆయనకు ప్రత్యేకంగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా.. సొంత నిఘా వర్గాల ద్వారా కూడా కేసీఆర్‌కు ఎప్పుడో రాష్ట్ర పరిస్థితి, ప్రజానాడిపై అవగాహన ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఆయన అలుపెరుగని విధంగా శ్రమించారని అంటున్నారు.
సహజంగానే పదేళ్ల పాలనపై ఉండే ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మకం గానే ప్రస్తుత ఎన్నికల్లో వ్యవహరించారనే చర్చలు ఉన్నాయి. 2014, 2018లో కూడా చేయని సుడిగాలి పర్యటనలు ఆయన చేశారు. లెక్కకు మించి సభల్లో పాల్గొన్నారు. మరోవైపు యాగాలు చేశారు. ఇంకోవైపు పథకాలు ప్రకటించారు. మొత్తంగా చూస్తే.. ఏవిషయాన్నీ కేసీఆర్ విస్మరించలేదు. అయినప్పటికీ.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితం మాత్రం.. తేడా వచ్చింది.
అయితే.. గెలుపు ఓటములు కేసీఆర్‌కు ఎప్పుడూ కొత్తకాదు కాబట్టి.. దీనిని ఆయన లైట్ తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. అలాగని ఆయన ఇంటికైతే పరిమితం అయ్యే పరిస్థితిలేదు. ఇక, ఇప్పుడు బీఆర్ ఎస్‌ను జాతీయస్థాయిలో పాదుకొల్పేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని.. రాష్ట్ర పార్టీ పగ్గాలను పూర్తిస్థాయిలో కుమారుడికి అప్పగించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
“కేసీఆరే చెప్పినట్టు.. గెలిచినా.. ఓడినా ఆయనకు పెద్దగా నష్టం లేదు. అయితే.. ఆయన జాతీయ స్థాయిలో మరింత తన హవా పెంచుకునేందుకు ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది” అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తీకరించారు. మరో మూడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్ననేపథ్యంలో కేసీఆర్.. ఈ ఓటమిని.. అప్పటి విజయానికి దారిగా మలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో 12 -14 మధ్య గెలిచే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఇదీ సంగతి!!