కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడిపై దాడి

తెలంగాణ ఎన్నికలలో కొన్ని ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరు, నర్సాపూర్ లో ఘర్షణలు జరిగాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో లింగంపల్లి బిట్ల తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

కొండల్‌రెడ్డి స్థానికేతరుడని బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మూడు కార్ల కాన్వాయ్‌లో కొండల్‌రెడ్డి కామారెడ్డిలో తిరుగుతున్నారని, ఇండిపెండెంట్ అభ్యర్ధికి పోలింగ్ ఏజెంట్‌గా తప్పుడు పత్రాలు సృష్టించి కామారెడ్డిలో ఉన్నారని ఆరోపించారు. కామారెడ్డిలో నాన్‌లోకల్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగాయి.

బీఆర్‌ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేశారని కొండల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వడం లేదని, పోలీసులు కూడా బీఆర్‌ఎస్ నేతలకు సహకరిస్తున్నారని కొండల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.