టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు 1 నుంచి యాక్టివ్ కానున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. విజయవాడకు చేరుకుని శుక్రవారం నుంచి యాధావిధిగా అన్నికార్యక్రమాల్లోనూ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
గురువారం సాయంత్రం చంద్రబాబు హైదరాబాద్ నుంచి శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి అక్కడే బస చేయనున్నారు. సంప్రదాయం మేరకు రేపు ఉదయం ముందుగా వరాహస్వామి వారిని బాబు దర్శించుకోనున్నారు. ఉదయం 7.30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం గాయత్రి నిలయంలో కాసేపు విశ్రాంతి తీసుకోనున్న చంద్రబాబు.. 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరనున్నారు. రేణిగుంట నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్ళనున్నారు.
అక్కడ నుంచి తొలుత అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం.. విశాఖలోని సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. అటు నుంచి తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకునే చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చిస్తారు. అనంతరం.. తన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
డిసెంబరు 3, 11, 15, 21 తేదీల్లో జరిగే బహిరంగ సభల్లోనూ చంద్రబాబు పాల్గొంటారు. అదేసమయంలో జనసేన-టీడీపీసమన్వయ సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, కురుపాం, విశాఖ, విజయవాడ, అనంతపురంలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates