తాడేప‌ల్లికి రండి.. ద్వారంపూడికి జ‌గ‌న్ పిలుపు!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి పిలుపు వెళ్లింది. “రండి.. ఒక్క‌సారి మాట్లాడుకుందాం” అని సీఎంవో కార్యాల‌యం నుంచి ఆయ‌న సందేశం వెళ్లిన‌ట్టు ఎమ్మెల్యే అనుచ‌రులు చెబుతున్నారు. ఇటు తాడేప‌ల్లి వ‌ర్గాలుకూడా దీనిని ధ్రువీక‌రించాయి. దీంతో శుక్ర‌వారం ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య‌మంత్రితో భేటీ కానున్నారు. అయితే.. ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత‌.. తొలిసారి ఇలా వ్య‌క్తిగ‌తంగా ద్వారంపూడికి సీఎం ఆఫీస్ నుంచి ఆహ్వానం రావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ద్వారం పూడి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ప్ర‌త్యేక ఆహ్వానం వ‌చ్చి ఉంటుంద‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు.

గ‌తంలోనూ ఒక‌సారి సీఎం కార్యాల‌యం నుంచి ఆయ‌న‌కు మంద‌లింపు వ‌చ్చింది. అయితే.. అప్ప‌ట్లో కేవ‌లం ఫోన్ ద్వారానే ద్వారం పూడికి సీఎం క్లాస్ తీసుకున్నార‌ని అప్ప‌ట్లో చ‌ర్చ సాగింది. అప్ప‌ట్లో గంజాయి ర‌వాణా విష‌యం పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో టీడీపీ నాయ‌కుల‌పై దూష‌ణ‌ల‌కు దిగి.. బ‌హిరంగంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీకి మైన‌స్‌గా మారాయి. దీంతో నేరుగా సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకుని అప్ప‌ట్లో మంద‌లించారు. ఆ త‌ర్వాత‌.. ద్వారంపూడి మీడియా ముందుకు రావ‌డం మానేశారు. ఏదైనా ఉంటే.. ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడి ద్వారా ప్రెస్‌నోట్లు మాత్ర‌మే ఇస్తున్నారు.

ఇక‌, తాజాగా సామాజిక సాధికార బ‌స్సు యాత్ర‌లో భాగంగా కాకినాడ సిటీ నియోక‌వ‌ర్గంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ద్వారం పూడి సీఎం జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. అయితే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నోరు జారారు. “రాష్ట్రంలో మ‌రోసారి జ‌గ‌నే రావాలి. ఆయ‌న పాల‌న చాలా బాగుంది. క్రైస్త‌వుల పాల‌న‌లో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్ర‌జ‌లు ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారు. కాబ‌ట్టి క్రైస్త‌వుడైన జ‌గ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం. మాజీ మంత్రి క‌న్న‌బాబు వంటి వారు కూడా.. క్రైస్త‌వుడైన జ‌గ‌నే సీఎం కావాల‌ని కోరుకుంటున్నారు” -అని ద్వారం పూడి చంద్ర‌శేఖ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌లు పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయ‌ని.. ప్ర‌ధాన స‌ల‌హాదారులు సీఎం జ‌గ‌న్‌కు నివేదించారు. ఇప్ప‌టికే టీటీడీ, అన్న‌వ‌రం, బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యాల్లో జ‌రిగిన కొన్నిప‌నుల కార‌ణంగా.. ప్ర‌భుత్వంపై హిందూ వ్య‌తిరేకి అనే ముద్ర ప‌డింద‌ని, దీని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో ద్వారం పూడి వ్యాఖ్య‌లు మ‌రింత డ్యామేజీగా మారాయ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను నేరుగా ముఖ్య‌మంత్రి ఆహ్వానించ‌డం… చ‌ర్చ‌నీయాంశం అయింది.