ఒక‌రిపై ఒక‌రు.. ఏపీలో దొంగ ఓట్ల రాజ‌కీయం!

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్నిక‌ల‌కు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెల‌కొంది. పైగా ఎవ‌రికి వారు రాజ‌కీయ ప్ర‌చారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గ‌త కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(స‌రిహ‌ద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండ‌డం, ఇప్ప‌టికే చ‌నిపోయిన వారికి కూడా ఓటు అలానే ఉండ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ విష‌యంలో వైసీపీపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫాం-7 ద్వారా ఓట్ల‌ను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయ‌కులు ఇంటింటికీ తిరుగు తూ.. ఓట్లుఉన్నాయా? లేదా? అనే విష‌యాల‌ను ఆరా తీస్తున్నారు. అదేస‌మ‌యంలో జీరో డోర్ నెంబ‌ర్‌లో భారీ సంఖ్య‌లో ఓట్లు ఉండ‌డాన్ని కూడా వారు వెలికి తీస్తున్నారు. ఇక‌, టీడీపీసానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గించారంటూ.. తాజాగాశ్రీకాకుళంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇలా.. టీడీపీ దొంగ ఓట్ల‌పై స‌మ‌రం షురూ చేసింది. వ‌చ్చే 15 వ‌ర‌కు కొత్త ఓట్ల‌కు అవ‌కాశం ఉండ‌డం.. ఓట‌ర్ల జాబితాలో మార్పుల‌కు అవ‌కాశం ఉండడంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని నాయ‌కులు కంటికి కునుకులేకుండా .. ఓట్ల వ్య‌వ‌హారంపైనే దృష్టి పెట్టారు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ ప్ర‌చారానికి వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. అస‌లు దొంగ ఓట్ల వ్య‌వ‌హారం అంతా కూడా.. టీడీపీదేన‌ని.. ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి తొల‌గిస్తు న్నారని.. వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ బృందం తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసి.. టీడీపీ నేత‌ల‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ వేడి పెరిగిన నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు, అటు టీడీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రంవిమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఓట్ల‌పై విరుచుకుప‌డ‌డం.. రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.