సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో కొత్త అడుగు వేస్తున్నారు. సొంతగా పార్టీ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తాజాగా ప్రకటించారు. అయితే.. దీనికి ‘అవసరం అయితే’ అని ట్యాగ్ జోడించడం గమనార్హం. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని జేడీ.. గత 2019 ఎన్నికలకు ముందు సీబీఐ ఉద్యోగానికి రాజీనామా సమర్పించి.. రాజకీయ అరంగేట్రం చేశారు. వస్తూ వస్తూనే జనసేన కు జై కొట్టారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ప్రజల అభిమానం చూరగొన్నా.. మద్దతు దక్కించుకున్నా.. ఓట్లు మాత్రం వేయించుకోలేక పోయారు. దీంతో ఆయన ఓడిపోయారు. ఇక, ఆతర్వాత.. జనసేనపై ఆగ్రహించి(పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడాన్ని తప్పుబట్టారు) బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు టీడీపీ, వైసీపీల నుంచి కూడా ఆహ్వానం అందినా.. ఆయన దూరంగా ఉన్నారు. అదేసమయంలో వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికల్లో విశాఖ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు.
అయితే.. తాజాగా ఆయన టంగ్ మార్చారు. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని చెప్పారు.
కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తన భవిష్యత్తును డిసెంబరు రెండో వారంలో వెల్లడిస్తానని జేడీ చెప్పారు. అయితే.. ఇటీవల ఆయన వైసీపీ సర్కాను పొగుడుతూ.. వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుండడం.. వైసీపీ కూడా విశాఖ సీటుపై ఆచితూచి అడుగులు వేస్తుండడంతో ఆయన వస్తారనే అనుకున్నారు. కానీ, తాజాగా కొత్తపార్టీ బాంబు పేల్చడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates