తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసినా.. అభ్యర్థులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఒకవైపు వారు ప్రచారానికి చేసిన ఖర్చు లెక్కలు తేల్చేందుకు ఎన్నికల సంఘం రెడీ కావడంతో అందరూ సతమతం అవుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం చివరి రోజు.. చివరి నిముషంలో ప్రజలను ఎమోషనల్‌గా ఆకట్టుకునేందుకు, వారిని సెంటిమెంటుతోతమవైపు తిప్పుకొనేందుకు.. ప్రయత్నించడం.. కీలక వ్యాఖ్యలు చేయడంపట్ల కూడా.. ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది.
తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల సంగతి తేల్చాలని.. ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు సాయంత్రం కౌశిక్ రెడ్డి ఓటర్లను ఒకవిధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. గెలిస్తే జైత్ర యాత్ర.. ఓడితే శవయాత్రే.. ఏది కోరుకుంటారో మీ ఇష్టం
అంటూ.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సుమోటోగా దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ వ్యాఖ్యల సంగతేంటో తేల్చాలని.. జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఈ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ చేపట్టేలా ఆదేశించాలని కూడా కలెక్టర్‌ను ఆదేశించారు. మొత్తంగా.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మరో 24 గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల దుమారం అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. కౌశిక్‌రెడ్డి వివరణపై సంతృప్తి చెందితే సరే.. లేకపోతే ఏం చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. కాగా, కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తలపడుతున్నారు.