మరో 24 గంటల్లో పోలింగ్ మొదలవ్వబోతున్న సమయంలో కాంగ్రెస్ లో మంచి జోష్ కనబడుతోంది. దీనికి కారణం ఏమిటంటే ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు ప్రకటించటమే. ఆర్టీసీలోని ఉద్యోగ, కార్మిక యూనియన్లలో మజ్డూర్ యూనియన్ కూడా బలమైనదనే చెప్పాలి. వేలాది మంది సభ్యులు ఉన్న మజ్దూర్ యూనియన్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాలని డిసైడ్ చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. యూనియన్లోని అన్ని స్థాయిల్లో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
యూనియన్ సభ్యులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడాలని అనుకుంటున్న విషయాన్ని రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కు చెప్పారు. జై రాం రమేష్ ఈ విషయాన్ని మీడియాతో చెప్పారు. మొత్తానికి వేలాది మంది సభ్యులున్న మజ్దూర్ యూనియన్ మద్దతు పలకాలని నిర్ణయించటమంటే కాంగ్రెస్ కు ప్లస్ పాయింటే కదా. ఇంతకీ ఎందుకింతగా మద్దతు ప్రకటించింది ? ఎందుకంటే యూనియన్ కు కేసీయార్ కు ఏ మాత్రం పడటం లేదు. ఒకపుడు తమ సమస్యల కోసం ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేస్తే కేసీయార్ లెక్కకూడా చేయలేదు.
పైగా యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అశ్వత్థామరెడ్డిని అప్పట్లో ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టింది. అధ్యక్ష బాధ్యతలను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న రెడ్డికి ఉన్న ప్రివిలేజెస్ అన్నింటినీ ఊడ బీకేసి మళ్ళీ డ్రైవర్ గా డ్యూటీలు వేసింది ప్రభుత్వం. మామూలుగా అధ్యక్ష, కార్యదర్శలు, ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో ఉన్న నేతలెవరూ ఉద్యోగాలు చేయరు. యూనియన్ నేతలమని చెప్పి ఉద్యోగ బాధ్యతలను పట్టించుకోరు.
ఒకపుడు ఈ వెసులుబాటును ప్రభుత్వమే వీళ్ళకి కల్పించింది. అప్పటినుండి ఏ యూనియన్ లో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలైనా ఇదే పద్దతి. అయితే ఆ పద్దతిని కేసీయార్ అడ్డుకట్టవేశారు. ఎవరైనా సరే డ్యూటీ చేయాల్సిందే అని గట్టిగా చెప్పారు. అప్పటినుండి రెడ్డితో పాటు చాలామంది యూనియన్ నేతలు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఇంతకాలం ప్రభుత్వాన్ని ఏమీచేయలేక ఇపుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. మరి వీళ్ళ మద్దతు కాంగ్రెస్ కు ఏ విధంగా లాభిస్తుందో చూడాల్సిందే.