గెలిస్తే జైత్రయాత్ర…ఓడితే శవ యాత్ర: కౌశిక్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే చివరి రోజు ప్రచారం సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల హామీలు, వాగ్దానాలతో హోరెత్తించారు. తమకు ఓటేసి గెలిపించాలని, ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు.

అయితే, హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం రొటీన్ కు భిన్నంగా మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరిన కౌశిక్ రెడ్డి ఓడిపోతే తనకు చావే గతి అన్న రీతిలో చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర అని… ఓడితే శవయాత్ర..అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఏ యాత్ర చేయాలో ప్రజలే నిర్ణయించుచాలంటూ ఓటర్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

‘మీరు ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాలా? ఇక మీ ఇష్టం. ఏం చేస్తారో మీ ఇష్టం…మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలను మీరు చూడాలి. మెజార్టీ ఇస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే నాలుగో తేదీన శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు ఇపుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.