తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదు. ఈ విషయం అందరికీతెలిసిందే. అలాగని.. ఏ పార్టీకీ బహిరంగ మద్దతు మాత్రం ప్రకటించలేదు. ఇది కూడా తెలిసిందే. అయితే.. పేరు చెప్పకుండానే.. ఈ టీడీపీ సానుకూల ఓట్ల కోసం.. బీఆర్ ఎస్, కాంగ్రెస్, జనసేన నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చంద్రబాబు అనుకూలంగా బీఆర్ ఎస్ కీలక నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబును ప్రశంసిస్తున్నారు.
ఇది ఒక భాగం. అయితే, క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో(టీడీపీకి బలమైన కార్యవర్గం ఉన్న చోట) నాయకులు తమ పార్టీ కండువాలతో పాటు టీడీపీ కండువాలు కూడా మెడలో వేసుకుని దర్శనమిస్తున్నారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో టీడీపీలో పనిచేసి. తర్వాత పార్టీ మారిన నాయకులు నేరుగా కండువాలు కప్పుకోకపోయినా.. తమ అనుచరులకు కప్పిస్తున్నారు. దీంతో టీడీపీ వీరికి మద్దతు పలికి ఉంటుందనే భ్రమ కల్పిస్తున్నారు.
ఇక, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు నేరుగా టీడీపీ కండువా వేసుకుని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ సానుభూతి పరులు తమకు అనుకూలంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే.. దీనిని టీడీపీ అధిష్టానం తాజాగా ఖండించింది. తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు దీనికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. తాము ఏ పార్టీకీ, ఏ నాయకుడికి మద్దతు ప్రకటించలేదన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏ పార్టీకీ మద్దతుగా ప్రకటన చేయలేదని.. తాము తటస్థంగా ఉన్నామని.. కండువాలు కప్పుకొని వచ్చేస్తున్నవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ సానుభూతి పరులు తమ ఆత్మ ప్రబోధాను సారం ఓటు వేయాలని ఆయన సూచించారు.