సీతక్కపై ఆరోపణలు వర్కవుటవుతాయా ?

మామూలుగానే రాజకీయ నేతలు చెప్పేవన్నీ నిజాలే అని అనుకునేందుకు లేదు. అలాంటిది ఎన్నికల్లో సమయంలో చెప్పేవాటిల్లో ఎన్ని నిజాలని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. పైగా ప్రత్యర్ధులపై బురదచల్లటం కూడా ఎన్నికల ప్రచారంలో ఒక భాగమే కదా. ఇపుడిదంతా ఎందుకంటే వరంగల్ జిల్లా ముగుగులో కేసీయార్ చెప్పిన మాటలు విన్నతర్వాత ఔరా మరీ ఇన్ని అబద్ధాలు చెబుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న నాగజ్యోతిని ఆశీర్వదించమని,  ఓట్లేసి గెలిపించమని కేసీయార్ అడిగారు.

తమ అభ్యర్ధిని ఆశీర్వదించమని, గెలిపించమని అడగటంలో తప్పేమీలేదు. కానీ ఇదే సమయంలో మీకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంఎల్ఏ సీతక్క ఏమిచేసిందని ప్రశ్నించారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇది కావాలని అది కావాలని ఎన్నడూ రాలేదని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధినే పట్టించుకోని సీతక్కను ఎందుకు గెలిపించాలని కేసీయార్ సూటిగా ప్రశ్నించారు. ఇక్కడే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలు బయటపడిపోయాయి. ముఖ్యమంత్రిని సీతక్క కలవలేదన్నది నిజమే అయ్యుండచ్చు.

అలాగే కలవటానికి ప్రయత్నంచేసింది కూడా వాస్తవమే. ప్రతిపక్షాల ఎంఎల్ఏలు తనను నియోజకవర్గం అభివృద్ధి కోసం కలవలేదని ఇపుడు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్ష ఎంఎల్ఏలు కాదు అసలు మంత్రులు, సొంత ఎంఎల్ఏలను కేసీయార్ ఎన్నడైనా కలిశారా ? కేసీయార్ ఫాం హౌస్ లోకి ఎవరూ అలౌడ్ లేదు కదా. సార్ గారు అనుమతుంటే తప్ప సొంతపార్టీ వాళ్ళనే సెక్యూరిటి వాళ్ళు ఫాం హౌస్ లోకి రానీయరు కదా. కేసీయార్ ను కలుద్దామని వచ్చిన మంత్రులు కూడా తిరిగి వెళ్ళిపోయిన ఘటనలున్నాయి కదా.

మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంఎల్ఏలనే కలవని కేసీయార్ ఇక ప్రతిపక్ష ఎంఎల్ఏలను కలుస్తారా ? నెలల తరబడి సచివాలయంలోకి అడుగుపెట్టనే పెట్టరు కదా. అంతెందుకు మునుగోడు ఉపఎన్నిక గెలుపుకు వాడుకున్న వామపక్షాల నేతలను ఎన్నిక అయిపోయిన తర్వాత ఎన్నడైనా కలిశారా ? వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఉలుకు పలుకులేదు కదా. తాను మాట్లాడదలచుకుంటే తప్ప ఎవరు ప్రయత్నించినా కేసీయార్ మట్లాడరని ప్రపంచమంతా తెలుసు. ఇంతోటిదానికి సీతక్క తనను కలవలేదని అబద్ధాలు చెప్పటం ఎందుకు ?