ఎన్నిక‌ల వేళ‌.. కారు బ్యానెట్‌లో నోట్ల క‌ట్ట‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌కుండా, వారికినోట్లు పంచి.. ఓట్లుకొనుగోలు చేయ‌కుండా చూసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర పోలీసుల వ‌ర‌కు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అడుగ‌డుగునా.. త‌నిఖీలు చేస్తున్నారు. ప్ర‌తి కారును ఆపుతున్నారు. బైకుల‌ను కూడా నిలుపుతున్నారు. నిలువునా శీల ప‌రీక్ష అన్న‌ట్టు..అంగుళం అంగుళాన్ని కూడా త‌నిఖీ చేస్తూ.. అక్ర‌మ న‌గ‌దు త‌ర‌లింపును అడ్డుకుంటున్నారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 400 కోట్ల రూపాయ‌ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నార‌నేది అన‌ధికార స‌మాచారం.

అయిన‌ప్ప‌టికీ.. ఈ న‌గ‌దు త‌ర‌లింపు మాత్రం ఆగ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ కొన‌సాగుతూనే ఉంది. పోలీసులు, త‌నిఖీ అధికారుల క‌ళ్లు గ‌ప్పి కోట్ల‌కు కోట్ల‌ను త‌ర‌లిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా చోటు చేసుకున్న ఘ‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. పోలీసుల త‌నిఖీల‌కు చిక్క‌కుండా కోట్ల రూపాయ‌ల‌ను త‌రిలించేందుకు అక్ర‌మార్కులు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఏకంగా మొత్తానికే మోసం తీసుకువ‌చ్చింది. వారు త‌ర‌లిస్తున్న కోట్ల రూపాయ‌ల సొమ్ముతో పాటు.. కారు కూడా కాలిపోయింది. దీంతో మ‌రింత‌గా పోలీసులు వారిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

ఏం జ‌రిగింది?

ఎన్నికల వేళ వరంగల్‌ జిల్లాలో పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు బానెట్‌లో నోట్ల కట్టలు పెట్టుకుని శుక్రవారం వరంగల్‌ నుంచి వర్ధన్నపేట వైపు బయల్దేరారు. బొల్లికుంట క్రాస్‌రోడ్ వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్‌ కారును నిలిపివేసి పరారయ్యాడు. ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను సంచిలో వేసుకుని పరారయ్యాడు. ఇదంతా సినీఫక్కీలో క్షణాల్లో జరిగిపోయింది. ఇంత‌లో కారుకు కూడా మంట‌లు అంటుకున్నాయి.

ఈ డబ్బు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ఉన్న కొన్ని నోట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా దగ్ధమైన కారును మామునూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనా స్థలిని వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రవీందర్‌ పరిశీలించారు. కారు, అందులోని నగదు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఎక్క‌డికి త‌ర‌లిస్తున్నార‌నే విష‌యాన్ని కూడా ప‌రిశీలిస్తున్నారు.