ఏపీలో జగన్ పాలన మరో మూడు మాసాల్లో ముగియనుందని, అయినా.. ఆర్భాటం మాత్రం మానుకోవడం లేదని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మూడు రాజధానుల కలలను ఆయన వీడడం లేదని ఎద్దేవా చేశారు. కోర్టులన్నా.. న్యాయ వ్యవస్థ అన్నా.. జగన్‌కు అత్యంత చులకనగా ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖకు తరలించేందుకు ఏపీ సీఎం జగన్ జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ మూడు రాజధానులు జరగని పని అని పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని తేల్చి చెప్పారు. అమరావతి కోసం మూడు నెలలు వెయిట్ చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో సెక్రటేరియట్ కట్టిందని.. అందులో కూర్చుని జగన్ ఇదేం రాజధాని అంటున్నారని, ఇంత కన్నా తెలివి తక్కువ తనం ఏముంటుందని విమర్శించారు.
“ఐటీ అభివృద్ధికి కట్టిన మిలేనియం టవర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను తరిమేస్తున్నారు. రుషికొండను ధ్వంసం చేశారు.. కైలసగిరిని నాశనం చేశారు. జగన్ పాలన ఎక్స్‌పైరీ డేట్ 3 నెలలు మాత్రమే. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు” అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates