ఎన్నికల వేళ.. అగ్రనాయకుల ప్రచారం కోరుకోని అభ్యర్థులు ఎవరుంటారు? అగ్రనేతలు వస్తే.. తమ గెలుపునల్లేరుపై నడకే అవుతుందని భావించని నాయకులు ఎవరుంటారు? అందుకే.. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ ఎస్ సహా కాంగ్రెస్‌లోఅగ్రనేతలకు డిమాండ్ పెరిగిపోయింది. ఐదు నిమిషాలు వచ్చి ప్రచారంలో ఇలా కనిపించి.. అలా వెళ్లిపోండి అంటూ.. ఈ రెండు పార్టీల్లోనూ అగ్రనేతలకు అభ్యర్థుల నుంచి విన్నపాలు వస్తున్నాయి.
ఇలానే బీఆర్ ఎస్ అగ్రనేత, మంత్రి కేటీఆర్ కు కూడా అభ్యర్థుల నుంచి ఫోన్లు.. మెసేజ్‌లు జోరుగా వస్తున్నాయి. మా నియోజకవర్గానికి రండి అంటే.. మా నియోజవకర్గానికి రండి అంటూ నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ నిన్న మొన్నటి వరకు సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే.. డిజిటల్ మీడియాలో కాంగ్రెస్ జోరుగా ఉండడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్వ్యూలు, చిట్ చాట్‌లకు ఆయన ప్రాధాన్యం ఇస్తూ.. నిరంతరం టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇదిలావుంటే.. తన తరఫున ప్రచారం చేయాలని మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేటీఆర్‌ను కోరుతున్నారు. ఒక్కసారివచ్చి పోరాదే! అని ప్రాధేయ పడుతున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉండడమే దీనికి కారణం. పైగా కమ్యూనిస్టులు కూడా.. వేరుగా పోటీ చేస్తున్నారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో కేటీఆర్ ద్వారా అయినా.. ఆయన గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎంత అడిగినా.. కేటీఆర్ మాత్రం కాలు కదపడం లేదు. మునుగోడు ముచ్చటను పట్టించుకోవడం కూడా లేదు. దీంతో ఆయన ఎందుకు ఇంతగా దీనిపై శీతకన్నేశారు? అనే చర్చ సాగుతోంది. దీనికి ప్రధానంగా.. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కేటీఆర్ ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక్కడే మకాం వేశారు. ఇక్కడ కనుక ఉప ఎన్నికలో కూసుకుంట్లను గెలిపిస్తే.. మునుగోడును తానే దత్తత తీసుకుని డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు.
సిరిసిల్ల మాదిరిగా మునుగోడును పరుగులు పెట్టిస్తానని, దళిత బంధును పూర్తిగా అమలు చేస్తామని.. ఇళ్లు ఇస్తామని.. ఇలా అనేక హామీలు గుప్పించారు. ఏదేమైనా.. ఉప ఎన్నికల్లో కూసుకుంట్లకు మునుగోడు ప్రజలు జై కొట్టారు. కట్ చేస్తే.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అంతేకాదు.. ఉప పోరు తర్వాత.. కేటీఆర్ కనీసం కన్నెత్తి కూడా ఈ నియోజకవర్గం వైపు చూడలేదు. దీంతో ఇప్పుడు మరోసారిఇక్కడకు వచ్చి.. ఏం చెప్పాలి? అనేది ఆయన ఆలోచన కావొచ్చని అంటున్నారు పరిశీలకులు. అందుకే మునుగోడు ముచ్చటను పక్కన పెట్టారని చెబుతున్నారు.