తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరుగుతున్న బీజేపీతో చేతులు కలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారే ఆయన ఇంటికి వెళ్లారో.. ఈయనే మనసులో ఉన్నట్టు చేశారో.. మొత్తానికి కమలంతో గ్లాసు దోస్తీ కట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ.. మరో ఐదారు రోజుల వరకు ప్రచార సమయం ఉంది. దీంతో సహజంగానే మిత్ర పార్టీ నుంచి ప్రచారం కోసం పవన్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. వచ్చే నాలుగు రోజుల పాటైనా ఆయన ప్రచారం చేయాలి.
అయితే.. ఇక్కడ ప్రధాన సంకటం.. ఎన్నికలు అనగానే ప్రత్యర్థులపై విరుచుకుపడాలి. పైగా హై ప్రొపైల్ నాయకుడు కాబట్టి పవన్ నేరుగా అధికార పార్టీపై శరాలు సంధించాలి. కానీ, ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. బీజేపీతో చేతులు కలిపినా.. బీఆర్ ఎస్‌పై పన్నెత్తు మాట అనే పరిస్థితి సహజంగానే టాలీవుడ్ వారికి లేకుండా పోయింది. అందుకే టాలీవుడ్ మౌనం పాటిస్తోంది. కానీ, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి తప్పని సరి పరిస్థితిలో వచ్చిన పవన్‌కు సబ్జెక్ట్ లేకుండా పోతోంది. ఆయన విమర్శించాలంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరునే విమర్శించాలి.
అలా విమర్శించే ధైర్యం, సాహసం.. మాట ఎలా ఉన్నా.. నోరు పెగిలే పరిస్థితి లేదు. ఒకవేళ ఏమైనా విమర్శలు ఎక్కుపెట్టినా.. బీఆర్ ఎస్ నుంచి షార్ప్ రియాక్షన్ ఖాయం. ఇది ఇండస్ట్రీకి చుట్టుకున్నా ఆశ్చర్యం లేదనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్.. పరిస్థితి అడకత్తర మాదిరిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. ఏపీని ముడిపెట్టి.. తెలంగాణ పోరాటాలను ప్రస్తావిస్తూ.. ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. అయితే, ఇవన్నీ ముగిసిన ముచ్చట్లుగానే ఉన్నాయి. వినీ వినీ తెలంగాణసమాజానికి బోరు కొట్టిందనే వాదన కూడా ఉంది.
అయితే.. ఇంతకు మించి పవన్‌కు మరో సబ్జెక్టు లేకుండా పోయింది. బీజేపీ ఒత్తిడితో బయటకు వచ్చినా.. ఎవరినీ టార్గెట్ చేయలేక.. ప్రస్తుత సమస్యలు ప్రస్తావించలేక.. ప్రజానీకం నాడి పట్టుకోలేక.. పవన్ తీవ్రస్థాయిలో సతమతమవుతున్నారనే లెక్కలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితిని తట్టుకుని బీజేపీ కోరుకున్న విధంగా ఆయన తెలంగాణ సమాజాన్ని ఎలా ఆకర్షిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates