ఆ వైసీపీ ఎమ్మెల్యేకు నో టిక్కెట్‌…!

అన్నా రాంబాబు. పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నాయ‌కుడు. ప్ర‌స్తుతం గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే… నిత్యం ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్‌తో మీడియా ముందుకు వ‌చ్చే అన్నా.. ఇటీవ‌ల కాలంలో ఫుల్ సైలెంట్ అయిపోయారు. అంతేకాదు.. విమ‌ర్శ‌ల జోరు కూడా త‌గ్గించారు. నిజానికి స్వ‌ప‌క్షంలో విప‌క్షం అన గ‌లిగే రేంజ్‌లో అన్నా విమ‌ర్శ‌లు అంద‌రికీ తెలిసిందే.

ఏ పార్టీలోనూ అన్నా సంతృప్తి చెందిన ప‌రిస్థితి లేదు. టీడీపీలో ఉన్నా.. అసంతృప్తితోనే ఆయ‌న రగిలి పోయారు. ఇక‌, వైసీపీలో విజ‌యం ద‌క్కించుకున్నా.. జ‌గ‌న్ త‌ర్వాత‌.. అదే రేంజ్‌లో మెజారిటీ ద‌క్కించుకున్నా ఆయ‌న‌లో మాత్రం సంతృప్తి లేకుండా పోయింది. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని.. కొన్నాళ్లు ఫైర్ అయ్యారు. త‌ర్వాత రెడ్డి సామాజిక వ‌ర్గం త‌న‌ను దూరం పెట్టింద‌ని విమ‌ర్శించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించినా.. ఇది నిజ‌మేన‌ని చెప్పాలి.

అన్నారాంబాబు వైఖ‌రి న‌చ్చ‌కో.. లేక ఆయ‌నతో పొస‌గ‌కో మొత్తానికి వైసీపీలోని రెడ్డి సామాజిక వ‌ర్గం ఆయనను దూరం పెట్టింది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో కూడా అన్నా ఒంట‌రి పోరు చేయాల్సి వ‌చ్చింది. పైగా ప్ర‌జ‌ల నుంచి ఎదురైన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేక పోయారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు అన్నాకు మ‌రింత సెగ పెరిగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌కు టికెట్ ఇవ్వొద్ద‌ని వ్య‌తిరేక వ‌ర్గం దుమారం రేపుతోంది.

గ‌త నెల‌లో జ‌రిగిన వినాయ‌క చ‌వితి పందిళ్ల‌లోనూ అన్నా రాంబాబు పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను కొంద‌రు తొల‌గించారు. దీనివెనుక వ్య‌తిరేక వ‌ర్గం ఉంద‌ని.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నా ప‌ట్టుబ‌ట్టారు. అయినా రాంబాబును ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇక‌, జిల్లాకు చెందిన మంత్రితోనూ రాంబాబు అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాంబాబు వైసీపీ టికెట్‌పై పోటీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. చేస్తే.. సొంతగా అయినా పోటీ చేయొచ్చ‌ని, లేదా.. వేరే పార్టీ చూసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.