తొందరలో జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోకల్ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ఇన్నిరోజుల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్ధులందరు కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీ నేతల అరాచకాలను బాగా హైలైట్ చేస్తున్నారు. అయితే ప్రచారానికి ఉన్నది మరో వారంరోజులు మాత్రమే కాబట్టి కాసింత స్ట్రాటజీని మార్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేసీయార్ వైఫల్యాలపై ఆరోపణలు గుప్పిస్తునే ఎక్కువగా లోకల్ సమస్యలను బాగా హైలైట్ చేయబోతున్నారట.
ప్రతి నియోజకవర్గంలోను ఎన్నో సమస్యలున్నాయి. అలాగే సంక్షేమపథకాల అమలులో ఎన్నో అవకతవకలు జరిగాయి. అర్హులైన లబ్దిదారులకన్నా అనర్హులకే లబ్ది ఎక్కువగా దొరుకుతోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతంతమాత్రంగానే జరిగాయి. లోకల్ సమస్యలను ప్రస్తావించినపుడు జనాలు ఎక్కువగా కనెక్టవుతారు. అందుకనే తమ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎక్కువగా స్ధానిక సమస్యలను బాగా హైలైట్ చేయాలని ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్లు అభ్యర్ధులందరికీ చెప్పారట.
లోకల్ సమస్యలను ప్రస్తావించేటపుడు బాధితులతో రెండు మూడు నిముషాలు మాట్లాడించాలని కూడా స్ట్రాటజిస్టులు అభ్యర్ధులకు చెప్పారట. పోటీచేస్తున్న అభ్యర్ధి సమస్యలను ప్రస్తావిస్తే అది ఆరోపణగా ఉంటుందని అబిప్రాయపడ్డారు. అదే సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జనాల్లో ఒక్కళ్ళిద్దరితో మాట్లాడిస్తే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని పార్టీ పెద్దలు ఆలోచించారని సమాచారం. అందుకనే చివరి వారంలో ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చేసి జోరుపెంచాలని అభ్యర్ధులందరికీ సూచనలు అందాయని పార్టీలో టాక్ వినబడుతోంది. ఇలాంటి ప్రచారంతో అభ్యర్ధులు లోకల్ లీడర్లను తప్పనిసరిగా పక్కనే ఉంచుకోవాలని కూడా చెప్పిందట.
ఇంటింటి ప్రచారం చేసేటపుడు లోకల్ లీడర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వ్యూహకర్తలు అభ్యర్ధులకు సూచించారు. పనిలోపనిగా గ్రామాల్లో మంచిపేరున్న తటస్తులను కూడా ప్రచారంలో తీసుకెళ్ళగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పారట. మరిది ఎంతవరకు సాధ్యమో అభ్యర్ధులే తేల్చుకోవాలి. రోడ్లు, తాగునీరు, ఉద్యోగాల భర్తీలో టీఎస్ పీఎస్సీ ఫెయిల్యూర్లను బాగా హైలైట్ చేయటంతో పాటు కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీలను పదేపదే ప్రజలకు వివరించటం వల్ల ఎక్కువ లాభం జరుగుతుందని స్ట్రాటజిస్టులు చెప్పారట. మరి కొత్త వ్యూహం ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.