అమెరికాకు తెలుగంటే ఎంత గౌరవమంటే..

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం. ఈ సంగతి తెలుగు వాళ్లు చాలామందికి గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పట్టింపు ఉండదు. అదే పొరుగున ఉన్న తమిళనాడులో తమిళ భాషా దినోత్సవం అంటే సందడి మామూలుగా ఉండదు. వాళ్ల భాషాభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కన్నడ ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. కానీ మన వాళ్లకే సొంత భాష మీద అంత మక్కువ ఉండదు. ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వాలకు నిర్లక్ష్యమే. ఆంధ్రప్రదేశ్‌లో అయితే భవిష్యత్ తరాలకు తెలుగుతో పూర్తిగా సంబంధాలు తెంచేసే ప్రయత్నం జరుగుతోంది.

ఏమైనా అంటే ఇంగ్లిష్‌తోనే ఉపాధి వస్తుంది.. తెలుగును నమ్ముకుంటే మిగిలేది శూన్యం అన్న వాదన లేవనెత్తుతున్నారు. మరి ఇప్పటిదాకా తెలుగులో చదువుకున్న వాళ్లు ఏమీ సాధించలేదా.. ఇతర రాష్ట్రాల్లో సొంత భాషకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వాళ్లు ముందుకు సాగట్లేదా అన్నది ఆలోచించాలి. ఐతే ఇది చాలా పెద్ద చర్చ కాబట్టి పక్కన పెట్టేద్దాం.

మన భాషకు ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా పేరున్న అమెరికా ఇస్తున్న ప్రాధాన్యం సంగతి గుర్తిద్దాం. ప్రపంచమంతా అమెరికన్ల మాతృభాష అయిన ఇంగ్లిష్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంటే.. ఆ దేశం తెలుగుకు ఇచ్చిన గుర్తింపు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అమెరికాలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభాను గణిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు జనాభా లెక్కల పత్రాన్ని అందజేసి వివరాలు నమోదు చేయమంటారు. ఆన్ లైన్లో కూడా ఈ సౌలభ్యం ఉంది.

ఐతే యుఎస్‌లో లక్షల్లో తెలుగువాళ్లు ఉండటం, వారికి అక్కడి సమాజంలో మంచి గుర్తింపు ఉండటంతో ఈ జనాభా లెక్కల పత్రాల్ని తెలుగులోనూ ముద్రించి ఇస్తోంది అమెరికా ప్రభుత్వం. వెబ్ సైట్లోనూ తెలుగులో వివరాలు నమోదు చేసే సౌలభ్యం ఉంది. మన భాషకు అమెరికాలో ఇంత ప్రాధాన్యం దక్కుతోందని తెలిశాక అయినా మన వాళ్లు మన భాషను పట్టించుకుని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగును ఇవ్వాల్సిన విలువ ఇస్తారేమో చూడాలి.