టీడీపీపై తరచుగా విమర్శల వర్షం కురిపించే వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. టీడీపీ నేతలకు ఆయన సవాల్ కూడా రువ్వారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల నీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఏదో చేసిందని ఇక్కడి నేతలు చెబుతున్నారన్న ఆయన.. ఇలా టీడీపీ హయాంలో గుడివాడ ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపించినా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు.
గుడివాడలో ఎన్టీఆర్ తర్వాత.. టీడీపీ తరఫున గెలిచింది తానేనని..అప్పట్లోనే ఏమీ చేయలేదని నాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం జగన్ మాత్రమే గుడివాడ ప్రజలను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారన్నారని తెలిపారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని నాని విమర్శలు గుప్పించారు. కనీసం తట్ట మట్టి కూడా చంద్రబాబు హయాంలో ఎత్తలేదని అన్నారు.
ప్రజలను ఆత్మబంధువులుగా చూసింది ఒక్క వైఎస్, జగన్ మాత్రమేనని కొడాలి వ్యాఖ్యానించారు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ధనికుల కార్లు బ్రేకులు వెయ్యకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాల ఆరాటమని అన్నారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్‌కు తాము చెప్పామని, కానీ, ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారని నాని వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్రంలో రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇదిలావుంటే, కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates