ఎన్నికల పండుగ చివరి దశకు వచ్చేసింది. మహా అయితే.. సరిగ్గా వారం రోజులు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే ఎనిమిది రోజులు. 28సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియటం.. 29న ఒక్క రోజు ఆగితే 30న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు డిసెంబరు 3న విడుదల కానున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ చివరి ఎనిమిది రోజుల ప్రచారం మరో ఎత్తు అని.. పోలింగ్ ముందు రోజు లెక్కనే వేరు ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని.. ప్రచార ఖర్చును చూసుకుంటున్న అభ్యర్థులకు దిమ్మ తిరిగిపోతుందని చెబుతున్నారు. ఒక మోస్తరు నియోజకవర్గాల్లోనే రోజుకు రూ.50లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరూ తగ్గేదేలే అన్న రీతిలో ఖర్చులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి చేయాల్సిన ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు.
రూ.అరకోటి పూర్తి కానిదే రోజు పూర్తి కాని పరిస్థితి ఉందంటున్నారు. ఈ లెక్కకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గంలోని ఒక్కో బూత్ పరిధి ప్రచారానికి రోజుకు రూ.5వేల చొప్పున రెండు పార్టీలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రచారానికి వచ్చే వారికి సంబంధించి కూడా లెక్కలు భారీగా ఉన్నాయి. కాలి నడకన ప్రచారానికి వస్తే రోజుకు రూ.500తో పాటు టిఫిన్.. భోజనంతో పాటు ఇంటికి వెళ్లే వేళలో క్వార్టర్ బాటిల్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
పురుషులకు రూ.500 ఇస్తున్నారని.. మహిళలకు మాత్రం రూ.400 మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. అదే బైక్ ర్యాలీ అయితే మాత్రం నాలుగు గంటల సమయానికి రూ.300 నుంచి రూ.400 వరకు ఇచ్చి పెట్రోల్ కు డబ్బులు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఖర్చువిపరీతంగా పెరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ.50 లక్షల వరకు ఖర్చు వస్తుందని.. అదే గ్రేటర్ పరిధిలో అయితే రోజుకు రూ.కోటి వరకు వస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి మించి రానున్న పది రోజుల ఖర్చు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.