ఎక్కడైనా.. ఏ పార్టీలో అయినా.. కీలక నేతలకు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల సహకారం అత్యంత అవసరం. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. నాయకులకేకాదు.. పార్టీలకు కూడా ప్రమాదమే. ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులు ఎలాంటి ఆలోచ న చేస్తున్నారో తెలియదు కానీ.. వారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీని మరింత నష్టపరచడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఆది నుంచి ఏపీ బీజేపీలో మన అనుకుంటే.. నాయకులు అందరూ ఏకం కావడం.. పార్టీ రాష్ట్ర చీఫ్‌కు మద్దతు ఇవ్వడం కనిపిస్తోంది.
‘మన’.. కాదని అనుకుంటే మాత్రం పుల్లలు పెట్టడం.. పొరుగు పార్టీల నుంచి విమర్శలు వచ్చినా.. స్పందించకపోవడం షరా మామూలుగా మారింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ నుంచి సోము వీర్రాజు వరకు ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి వరకు అందరూ అలానే చేస్తున్నారు. కన్నా పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు.. ఆయనకు సగం మంది దూరంగా ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధం లేని వ్యక్తిని.. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌తో ఉన్న వ్యక్తిని పార్టీకి ఎలా అధ్యక్షుడిని చేస్తారంటూ.. అప్పట్లో ప్రశ్నించారు. దీంతో పార్టీకే నష్టం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో కనీస పరువును కూడా పార్టీ నిలబెట్టుకోలేక పోయింది.
ఇక, తర్వాత సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టారు. మరి ఈయన ఆర్ ఎస్ ఎస్ మూలాల నుంచి వచ్చిన నాయకుడే. పైగా బీజేపీలోనే ఉన్నారు. మరి ఈయనకు ఎంత మంది సహకరించారు? అంటే.. చెప్పడం కష్టమే. ఆయన ఏం చేసినా.. వంకలు పెట్టడం.. మీడియాకు లీకులు ఇవ్వడం.. అధిష్టానానికి ఫిర్యాదులు మోయడం.. కూడా కామన్‌గా జరిగింది. దీంతో సోము హయాంలో వచ్చిన స్థానిక ఎన్నికలు, రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు ఉప ఎన్నికలోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయినా.. పార్టీ నాయకులు మాత్రం మారడం లేదు.
తాజాగా పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించారు. అప్పటి వరకు మార్పుకోరుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు.. పురందేశ్వరికి పగ్గాలు ఇచ్చిన తర్వాత.. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పోనీ.. ఆమె ఏమన్నా.. వీరి గొంతు నొక్కారా? అంటే అదేం లేదు. కానీ, ఉద్దేశ పూర్వకంగానే విష్ణువర్ధన్‌రెడ్డి, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు సహా అనేక మంది క్షేత్రస్థాయి నాయకులు ఎక్కడా బయటకు రావడం లేదు. ఒకవైపు పురందేశ్వరి వైసీపీ సర్కారుపై అనేక కోణాల్లో యుద్ధం ప్రకటిస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. కానీ, సొంత పార్టీ నేతల నుంచి మాత్రం ఆమెకు సహకారం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
నిజానికి ఈ క్రమంలో పురందేశ్వరిని వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు కూడా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. లేనిపోని వ్యాఖ్యలతో ఆమెను మానసికంగా ఇబ్బందికికూడా గురి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అయినా.. ముందుకు వచ్చి.. వారికితగిన విధంగా సమాధానం చెప్పాల్సిన నాయకులు ఎక్కడున్నో.. ఏం చేస్తున్నారో.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి సమయం లేకుండా పోవడం.. పురందేశ్వరికి మద్దతుగా నాయకులు ముందుకు రాకపోవడంతో ఇది పార్టీకే మరింత నష్టం కలిగిస్తుందని అంటున్నారు పరిశీలకులు.