తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు పార్టీలు, నాయకులు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ప్రజలను కలుస్తున్నారు. గుప్పెడు మెతుకులు తింటున్నారో కూడా తెలియదు.. ఇలాంటి బిజీ వాతావరణంలో కీలకమైన నిజామాబాద్ స్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగిన అభ్యర్థి.. ఆదివారం ఉదయం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిజామాబాద్ నియోజకవర్గం అత్యంత కీలకమైందనే విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీల మద్య పోటీ నెలకొంది. అయితే.. కన్నయ్య గౌడ్ అనే వ్యక్తి.. గత కొన్నాళ్లుగా ఇక్కడి రైతుల పక్షాన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో వారి మద్దతుతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నారు.
కన్నయ్య గౌడ్ ఆత్మహత్యకు గల కారణంపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ నిమిత్తం అందిన కాడి దగ్గర కన్నయ్య అప్పులు చేసినట్టు తెలిపారు. అయితే.. వీటిలో యాప్‌ల నుంచి కూడా రుణాలు తీసుకున్నారని.. ఆ సొమ్ముతోనే ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల నుంచి వస్తున్న ఏజెంట్లు వేధింపులకు గురి చేస్తున్నారని.. ఈ వేదనను తట్టుకోలేక.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.