ట్రంప్ టైం బాగోలేదా? ఈ అపశకునాల సంకేతాలేంటి?

గడిచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని చెప్పే పెద్ద మనిషి.. ఈసారి ట్రంప్ కు వ్యతిరేకంగా తన అంచనాను చెప్పటం తెలిసిందే. కీలకమైన ఎన్నికల వేళలో.. అదే పనిగా నల్లజాతీయులపై శ్వేతజాతీయ పోలీసులు విరుచుకుపడుతున్న తీరు.. వారి కారణంగా పోతున్న ప్రాణాలు అమెరికన్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి సరిపోనట్లుగా.. ఇటీవల కాలంలో ట్రంప్ కు ఏదీ కలిసి రావటం లేదంటున్నారు. తాజాగా ఉత్తర కరోలినాలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ఎన్నికల సభలో పాల్గొన్న నలుగురికి కరోనా సోకినట్లుగా తేలటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 24 నుంచి 27 వరకు జరిగిన సమావేశంలో ట్రంప్ ను.. ఉపాధ్యక్షుడిగా బరిలోకి దిగిన మైక్ పెన్స్ లను అధికారికంగా ఎన్నుకునేందుకు ఏర్పాటైన ఈ సమావేశంలో దాదాపు మూడు వందల మందికి పైనా పాల్గొన్నారు.

ఈ మీటింగ్ లో పాల్గొన్న వారికి.. సిబ్బందికి కలిపి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు షాకింగ్ గా మారాయి. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నలుగురికి పాజిటివ్ గా తేలటం రిపబ్లికన్ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో పలువురు మాస్కులు ధరించకపోవటాన్ని అధికారులు తప్పు పట్టినా పట్టించుకోలేదు. చివరకు వైట్ హౌస్ లో నిర్వహించిన కార్యక్రమంలోనూ వెయ్యి మంది వరకు పాల్గొనటం.. వారిలో కూడా పలువురు మాస్కులు ధరించలేదు. ఈ తీరుపై విమర్శలువెల్లువెత్తున్నాయి. ట్రంప్ కు సంబంధించిన కార్యక్రమాల్లో ఇలాంటి సిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటే.. డెమొక్రాట్ల అభ్యర్థి పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఇలాంటివి పెద్దగా చోటు చేసుకోవటం లేదంటున్నారు. చూస్తుంటే.. ట్రంప్ టైం బాగాలేదా? అన్న మాట తరచూ వినిపిస్తుండటం గమనార్హం.