చిన్న‌మ్మ‌కు అస‌లు ‘రాజ‌కీయం’ తెలిసిన‌ట్టుందే!!

అస‌లు రాజ‌కీయాలు అంటే ఎలా ఉంటాయో.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రికి ఇప్పుడు బాగా తెలిసిన‌ట్టుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో వైసీపీ నుంచి ఎదురైన దాడి మామూలుగా లేదు. పురందేశ్వ‌రిని టార్గెట్ చేస్తూ.. మంత్రి రోజా, ఎంపీ సాయిరెడ్డి వంటి వారు చేసిన కామెంట్లు.. తీవ్రంగానే ఉన్నాయి. కానీ, ఇది రాజ‌కీయం. అందునా.. మారిన మారుతున్న రాజ‌కీయాల్లో ఇవి కామ‌న్‌గా మారిపోయాయి. రెండు అను-నాలుగు అనిపించుకో! అనే త‌ర‌హాలో రాజ‌కీయాలు సాగుతున్నాయి.

కానీ, పురందేశ్వ‌రి విష‌యాన్ని తీసుకుంటే.. ఆమె ఎప్పుడు ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలి ముద్ర వేసుకోలేదు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌ర్వాత‌.. బీజేపీలోకి వ‌చ్చినా.. మీడియా స‌మావేశాలు పెట్టిన దాఖ‌లాలు పెద్ద‌గా లేదు. పెట్టినా.. స‌బ్జెక్ట్ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు ఆమె దిగ‌లేదు. ఇంత వ‌ర‌కు ఆమె జంటిల్మ‌న్ రాజ‌కీయాలే చేశార‌ని చెప్పాలి. కానీ, ఎప్పుడైతే.. వైసీపీ వంటి కీల‌క పార్టీతో పెట్టుకున్నారో.. కీల‌క‌మైన అంశాల‌పై ఆమె ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారో.. అనూహ్యంగా ఆమె ప‌రిస్థితి మారిపోయింది.

ముందు-వెనుక కూడా చూడ‌కుండా.. పొలిటిక‌ల్ కామెంట్ల మాటున వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. కుటుంబాన్ని కూడా రోడ్డున ప‌డేలా రాజ‌కీయ విమ‌ర్శ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. వ్య‌క్తిత్వ హ‌నాన్ని కూడా ఈ వ్యాఖ్య‌లు రుజువు చేశాయి. కానీ, ఇవ‌న్నీ.. ఈ 20 ఏళ్ల పురందేశ్వరి రాజ‌కీయాల్లో ఎప్పుడూ విని.. క‌ని ఉండ‌క పోవ‌చ్చు. కానీ, ఒక్క‌సారి రాజ‌కీయాల్లోకి అంటూ వ‌చ్చాక‌.. ద‌ర్శ‌కుడు వ‌ర్మ చెప్పిన‌ట్టు అన్నింటికీ రెడీ అయి ఉండాల్సిందే.ఈ విష‌యమే ఇప్పుడు చిన్న‌మ్మ గ్రహించాలి.

అదేస‌మ‌యంలో చిన్న‌మ్మ‌కు మ‌రో ఇబ్బంది కూడా ఉంది. సొంత పార్టీ బీజేపీ నాయ‌కులు.. వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఎదురు దాడి చేయ‌డం లేదు. క‌నీసం పురందేశ్వ‌రిని స‌మ‌ర్ధిస్తూ.. మీడియా స‌మావేశాలు కూడా పెట్ట‌డం లేదు. ఇది మ‌రింత‌గా గోరుచుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా మారింది. ఇక‌, టీడీపీ వాళ్ల‌కు ఒకింత బాధ ఉన్నా.. వారు నేరుగా ఏమీ అనే ప‌రిస్థితి లేదు. మొత్తంగా.. చూస్తే.. చిన్న‌మ్మ‌కు అస‌లు రాజ‌కీయం అంటే.. ఇప్పుడు తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.