స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా..ఏపీ సీఐఢీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
మధ్యంతర బెయిల్‌పై వచ్చి చికిత్స పొందుతున్న చంద్రబాబు మెడికల్ రిపోర్టులో తప్పులు ఉన్నాయని పొన్నవోలు వాదించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మార్చారని ఆరోపించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు డబ్బు తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం వెల్లడైందని వాదించారు. సీమెన్స్ వాళ్లే నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారని అన్నారు.
ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని, సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్‌లో అంతా వెరిఫై చేయలేదని రాశారని లూథ్రా వాదించారు. చంద్రబాబును ఇరికించేందుకే ఈ ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని అన్నారు. ఎలక్షన్స్ ముందు కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. బెయిల్‌పై విచారణ జరిపేటప్పుడు కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. 2018 నుంచి విచారణ జరుగుతోందని, ఇన్నేళ్ల విచారణ తర్వాత చంద్రబాబును జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఈ కేసులో చంద్రబాబు మినహా మిగతా వారంతా బెయిల్‌పై బయట ఉన్నారని, ఆయనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
సీఐడీ డీజీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి అడ్వొకేట్ ఎథిక్స్‌కి విరుద్దంగా చంద్రబాబుపై అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అధికారంలో ఉన్నవారి తొత్తుల్లా ఉండకూడదని అన్నారు. చంద్రబాబుపై నెలన్నరలోనే వరుసగా 6 కేసులు పెట్టారని, ఇవి కక్షపూరితంగా పెట్టిన కేసులని వాదించారు.