టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. అయితే.. ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పోలీసులు కార్యకర్తను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. చేతిలోని కర్రను బాలయ్య కారుపై విసిరేసి.. సదరు కార్యకర్త అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది.
ఏం జరిగిందంటే..
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ మండలస్థాయి నాయకుడు, గత ఎన్నికల్లో బాలయ్య తరఫున ప్రచారం చేసి.. మెజారిటీ ఓట్లు సాధించి పెట్టిన అశ్వత్థ రెడ్డి కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహ విందును మాత్రం.. హిందూపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే బాలయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
దీంతో బాలయ్య ఈ వివాహ రిసెప్షన్‌కు హాజరై.. వధూవరులను ఆశీర్వదించి కారులో పయనమయ్యారు. సహజంగానే తమ ఎమ్మెల్యే, అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో నియోజకవర్గం సహా చుట్టుపక్కల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరిలో ఎక్కడో నక్కిన ఓ వైసీపీ కార్యకర్త.. చేతిలో కర్రతో కారు బయలు దేరుతుండగా తటాల్న మీదకు ఉరికి వచ్చాడు. చేతిలోని కర్రతో కారు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశాడు.
ఈ హఠాత్ పరిణామంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు వైసీపీ కార్యకర్తను నిలువరించారు. దీంతో ఆ యువకుడు కార్రను కారుపైకి విసిరేసి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఈ కర్ర కారు అద్దానికి బలంగా తగిలి పక్కనే ఉన్న ఎస్సై తలపై పడింది. కాగా, కర్రతో దాడికి యత్నించిన యువకుడు.. మధు అని.. వైసీపీ కార్యకర్త అని పోలీసులు గుర్తించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates