అధికారపార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే మినీ మ్యానిఫెస్టోను రెండుపార్టీల సమన్వయ కమిటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ ఇచ్చిన 6 హామీలుండగా జనసేన ఇచ్చిన 5 హామీలున్నాయి. ఈ రెండింటిని కలిపి 11 హామీలతో మినీ మ్యానిఫెస్టోను సమన్వయ కమిటి ఖాయం చేసింది.
పూర్తిస్ధాయి మ్యానిఫెస్టోపై కసరత్తు జరుగుతోంది. వివిధ రంగాల్లోని ప్రముఖులు, నిపుణులతో సమన్వయకమిటి సభ్యులు చర్చలు జరుపుతున్నారు. వాళ్ళదగ్గర నుండి తీసుకున్న ఇన్ పుట్స్ తో డిసెంబర్ కు పూర్తిస్ధాయి మ్యానిఫెస్టో రఫ్ కాపీని రెడీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నది. దీనిపై చంద్రబాబునాయుడుతో చర్చించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులు చేసి అప్పుడు పూర్తిస్ధాయి మ్యానిఫెస్టోను సిద్ధం చేయాలని ఉమ్మడి కమిటి నిర్ణయించింది. ఒకవైపు మ్యానిఫెస్టోపై కసరత్తులు జరుగుతుండగానే మరోవైపు ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.
శుక్రవారం నుండి ఉమ్మడి కమిటీల ఆధ్వర్యంలో 100 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోను వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రెండుపార్టీలు తమ కమిటీలకు అవసరమైన ఆదేశాలను ఇప్పటికే జారీచేశాయి. ఈ కార్యాచరణలో భాగంగా రెండుపార్టీల నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా వివరించబోతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, పెరిగిపోతున్న ధౌర్జన్యాలు, అరాచకాలను కూడా వివరించాలని నిర్ణయించారు.
మొత్తానికి వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి కార్యాచరణకు రెడీ అవుతున్న రెండుపార్టీలు ఇదే ఊపును ఫిబ్రవరి నెలవరకు కంటిన్యు చేయాలని నిర్ణయించాయి. ఎందుకంటే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఒకసారి షెడ్యూల్ విడుదలైతే ఇక ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లే అనుకోవాలి. అప్పటినుండి ఎలాగూ ఎన్నికల హీట్ బాగా పెరిగిపోతుంది. అందుకనే వ్యూహాత్మకంగా సరిగ్గా 100 రోజుల కార్యాచరణను రెండుపార్టీలు ప్రకటించింది. మరి వీళ్ళ కష్టం చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates