తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. వివిధ పార్టీల తరపున పోటీపడుతున్న అభ్యర్థులు విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో కొన్ని సిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల వారసులు ఈ సారి ఎన్నికల్లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కానీ మూడో తరం వారసులు కూడా ఈ సారి ఎన్నికల సమరంలో దిగడం ఆసక్తి రేపుతోంది.
దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు చిట్టెం పర్ణికారెడ్డి ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఆమె పోటీ చేస్తున్నారు. నర్సిరెడ్డి స్వాతంత్ర్య సమర యోధుడు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు ఎమ్మెల్సీగా పనిచేశారు. 1985, 1989లో జనతాదళ్ పార్టీ తరపున మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగి మూడో సారి విజయం సాధించారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఆయన 2015లో నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. అప్పుడు ఆయన కుమారుడు వెంకటేశ్వర్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. రాజకీయాల్లో తాత ఘన వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఇప్పుడు పర్ణికారెడ్డి రంగంలోకి దిగారు.
మరోవైపు దివంగత మాజీ ఎంపీ వొడితెల రాజేశ్వరరావు మనవడు వొడితెల ప్రణవ్ కూడా ఈ సారి సమరానికి సై అంటున్నారు. కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిగా ఆయన నిలబడ్డారు. విజయం కోసం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డితో ప్రణవ్ తలపడుతున్నారు. ఒకప్పుడు రాజేశ్వర రావు కుటుంబం రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగింది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కు రాజేశ్వర రావు అండగా నిలిచారు. ఆయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంత రావు కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే లక్ష్మీకాంత రావు వారసులకు బీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యత రాజేశ్వర రావు వారసులకు దక్కడం లేదని టాక్. రాజేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ప్రణవ్ కు మంచి భవిష్యత్ ఉంటుందని మంత్రి హరీష్ అన్నారు. కానీ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు పోటీకి సిద్ధమయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates