మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, పట్టాభి హాజరయ్యారు. జనసేన తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఆల్రెడీ ప్రతిపాదించిన 6 అంశాలకు తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలను కలిపి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించామని యనమల వెల్లడించారు.
ఈ మినీ మేనిఫెస్టోకు కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ. 10లక్షల వరకూ సబ్సిడీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు.. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి మినీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పై ప్రాథమిక చర్చలు జరిగాయని చెప్పారు. టీడీపీ నుంచి సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నామని యనమల ప్రకటించారు.
సౌభాగ్య పదం పేరుతో యువత వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని, సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి వ్యూహ రచన చేస్తామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని, అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా జనసేన- టీడీపీల మధ్య నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరఫున ఇన్చార్జిలను నియమించారు. ఆ ఇన్చార్జిలను ‘పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ గా పరిగణిస్తారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులు ఎలా కలిసి పని చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని నియోజకవర్గ స్థాయి నేతలకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లు వివరించబోతున్నారు. ఇక, ఈ నెల 17 నుంచి నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమం కూడా ఈ ఇన్చార్జిల ఆధ్వర్యంలోనే జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates