తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రమైన పరిణామం తెరమీదకు వచ్చింది. వివిధ పార్టీల్లో టికెట్లు దక్కని వారు.. స్థానిక నాయకులపై అక్కసుతో ఉన్నవారు.. ఎన్నికల్లో రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. మొత్తం 119 నియోజవర్గాలుంటే.. నామినేషన్లు మాత్రం 4327 వరకు దాఖలయ్యాయి. వీటిలో వాలీడ్ నామినేషన్లు 3250 వరకు లెక్కగట్టారు. అంటే.. వీరంతా కూడా పోటీలో ఉన్నట్టే లెక్క. వీరిలో కులాలు, మతాల ప్రాతిపదికన బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు.
ఇక, పోటీలో ఉన్నవారిలో స్వతంత్రులు ఎక్కువగా ఉన్నారనేదిఎన్నికల సంఘం కూడా తేల్చి చెప్పింది. ఇదే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారింది. రెబల్స్‌దూకుడుతో.. తమ పుట్టి మునుగు తుందని.. అధికార బీఆర్ ఎస్,విపక్ష కాంగ్రెస్‌లు లెక్కలు వేసుకుంటున్నాయి. దీంతో పోటీలో ఉన్న వారిని వెనక్కి తప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కనీసం 1000 నుంచి 5000 మధ్య ఓట్లను స్వతంత్రులు ప్రభావితం చేసే అవకాశం ఉండడం మరో సంచలనంగా మారింది.
ఇక, నామినేషన్ల ఉప సంహరణకు మరో మూడు రోజుల అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెబల్స్‌తో ఎలాగైనా సరే.. నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం ద్వారా తొలి విజయం దక్కించుకునేం దుకు పార్టీల నాయకులు రెబల్స్‌ను లైన్‌లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బుజ్జగింపుల పర్వానికి తెరదీశారు. అయితే..రెబల్స్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఎన్నికలకు ముందు నుంచి మాకే టికెట్ ఇస్తామని ఆశ చూపారు. దీంతో మేం లక్షలకు లక్షలు ఖర్చు చేసి ప్రజల మధ్య తిరిగాం. కానీ, టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సొమ్ము ఎవరిస్తారు? మేం రెంటికీ చెడ్డాలా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక, అంతో ఇంతో ప్రభావితం చూపుతారని అనుకున్న రెబల్స్ మాకేంటని నేరుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వారిని మచ్చిక చేసుకునేందుకు వారు ఖర్చు చేసిన సొమ్మును తిరిగి ఇస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే.. దీనికి కూడా.. రెబల్స్ ససేమిరా అంటున్నారు. హామీలు కాదు.. చేతికి ఎమౌంట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఒకవైపు.. ప్రజల్లోప్రచారం పెంచుకోవాల్సిన సమయంలో రెబల్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక.. అభ్యర్థులు సతమతం అవుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీల అధిష్టానాలకు చెబితే.. రెబల్స్‌నే దారికి తెచ్చుకోలేక పోతున్నారా? అంటూ.. ఈసడింపులు ఎదురవుతున్నాయి. మొత్తానికి అభ్యర్థులకు రెబల్స్ బెడద భారీ ఎత్తున సెగ పెడుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.