సోష‌ల్ మీడియాకే ప‌వ‌న్ ప‌రిమితం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన‌పై క‌మ‌లం పార్టీ నాయ‌కులు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌వ‌న్ ప్రచారం చేస్తే..త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నా రు. వాస్త‌వానికి సెటిల‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌వ‌న్ మంత్రం ఫ‌లిస్తుంద‌ని కూడా బీజేపీ పెద్ద‌లు అనుకు న్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ నేత‌లు ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ పొత్తుల విష‌యాన్ని చ‌ర్చించారు. మొత్తంగా 8 స్థానాల్లోప‌వ‌న్‌కు అవ‌కాశం ఇచ్చారు.

మిగిలిన‌ 111 స్థానాల్లోనూ బీజేపీ పోటీకి దిగింది. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేవ‌లం 15 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. దీంతో క‌నీసం 7 రోజులు త‌మ వైపు ప్ర‌చారం చేసేలా బీజేపీ నాయ‌కులు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ప‌వ‌న్‌ను ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో(ఉమ్మ‌డి) వినియోగించుకోవాల‌ని భావిస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే వ్యూహం మారిపోయింది. ప‌వ‌న్ ప్ర‌చారంతో వ్య‌తిరేక ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ నేత‌లు బెంగ పెట్టుకున్నారట‌.

ప‌వ‌న్‌పై ఏపీ నాయ‌కుడుఅనే ముద్ర ఉండ‌డం.. తెలంగాణ‌లో ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌క‌పోవ‌డం.. పైగా ప్ర‌స్తుతం పార్టీ ఎన్నిక‌ల గుర్తు కూడా లేక పోవ‌డం.. జ‌న‌సేన త‌ర‌ఫున పోటీలో ఉన్న అభ్య‌ర్థులు స్వ‌తంత్రులుగానే రంగంలోకి దిగ‌డం వంటి ప‌రిణామాలు.. ప్ర‌స్తుతానికి స్త‌బ్దుగా ఉన్నాయి. బీఆర్ ఎస్ నాయ‌కులు బీజేపీని వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్‌ను వారు ఎక్క‌డా విమ‌ర్శించ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష పోరాటంలోకి దిగితే.. బీఆర్ ఎస్ నాయ‌కులు ఈ అంశాల‌నే ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు కాద‌ని.. ప‌వ‌న్ నేరుగా ప్రచారంలోకి వ‌స్తేనే రంగంలోకి దిగాల‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా భావిస్తున్నారు. దీంతో ప‌వ‌న్ ఒక అడుగు వెన‌క్కి వేసి సోష‌ల్ మీడియాకే ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం . అంటే.. కేవ‌లం సోష‌ల్ మీడియాకే ఆయ‌న ప్ర‌చారాన్ని ప‌రిమితం చేస్తారు. లేదా బీజేపీ అగ్ర‌నేత‌లు పాల్గొనే స‌భ‌ల‌కు మాత్ర‌మే ఆయ‌న హాజ‌రు కానున్నారు. దీంతో బీజేపీ నేత‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.