ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో నినాదాలు మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల లో ఇప్పటికి అరడజను నినాదాలను వైసీపీ ప్రచారంలోకి తీసుకువచ్చింది. అయితే.. ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ముందుకు సాగడం గమనార్హం. దీనిపై విపక్షాలు పరోక్షం విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ.. ఇప్పటి వరకు గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్, జగనే మా భవిష్యత్తు, వైనాట్ 175 సహా పలు నినాదాలను ప్రజల్లోకి తీసుకువచ్చింది.
అదే సమయంలో ఎమ్మెల్యేలను మంత్రులను కూడా క్షేత్రస్థాయిలో గడపగడపకు తిప్పింది. ఇక, ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి కూడా వైసీపీ తెరదీసింది. అదే సమయంలో వైనాట్ 175 అంటూ.. సెంటిమెంటు, సంచలనాలతో కూడిన స్టేట్‌మెంట్స్, నినాదాలు కూడా ఇచ్చింది. మొత్తంగా ఇన్ని నినాదాలు.. ఇన్ని కార్యక్రమాలను కేవలం నాలుగున్నరేళ్లలోనే మార్చడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
నిజానికి అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలపై ఫోకస్ చేసేందుకు చివర వరకు వెయిట్ చేస్తుంది. కానీ, వైసీపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుగానే అడుగులు వేసింది. పార్టీ తరఫున ప్రచారం చేస్తోంది. ఇక, ఇప్పుడు ఏపీకి జగనే ఎందుకు కావాలి (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నాలుగున్నరేళ్లలో సర్కారు చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడం తోపాటు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
మొత్తంగా వైసీపీలో నినాదాలు అయితే.. ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వీటికి దీటుగా ప్రతిపక్షాలు కూడా కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఏమేరకు వైసీపీ విజయం దక్కించుకుంటుందనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates