తెలుగు వారి అన్నగారు.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ .. సినీ రంగంలోనే కాదు.. రాజకీయంగా కూడా అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు. ఒకే సమయంలో రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసి, విజయం కూడా దక్కించుకున్న ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన గురించిన చర్చ తెలంగాణ ఎన్నికల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుత సీఎం, బీఆర్ ఎస్ అదినేత కేసీఆర్.. ఒకే సారి రెండు నియోజకవర్గాల నుంచి తలపడుతుండడమే.
నిజానికి రాజకీయాల్లో కీలక నాయకులు ఒకేసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం సహజమనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోనూ.. కేరళలోని వైయనాడ్ నియోజకవర్గంలోనూ పోటీ చేశారు. వయనాడ్‌లో గెలవగా.. యూపీలో ఓడిపోయారు. ఇలానే గతంలో మెదక్ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేశారు. ఇక, జనసేన అధినేత పవన్ ఒకే దఫా.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేశారు.
ఇలా నాయకులు ఒకటికి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం కొత్తకాకపోయినా.. గెలుపుపైనే అందరూ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో తీసుకుంటే.. చాలా మంది నాయకులు రెండు చోట్ల పోటీ చేసి ఒకే చోట గెలిచిన సందర్భాలు ఉన్నాయి. రెండు చోట్లా గెలిచిన వారు చాలా అరుదుగా ఉన్నారు. ఇలాంటి వారిలో ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేశారు. 1) నల్గొండ, 2) హిందూపురం, 3) గుడివాడ.
చిత్రం ఏంటంటే.. ఈ మూడు చోట్లా కూడా అన్నగారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గెలుపు గుర్రం ఎక్కించారు. తర్వాత.. ఆయన హిందూపురం ఉంచుకుని మిగిలిన రెండు నియోజకవర్గాలకు రాజీనామా చేశారు. అదేవిధంగా 1989 ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేశారు. కల్వకుర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ పోటీ చేయగా.. ఈ సారి మాత్రం హిందూపురంలోనే విజయందక్కించుకున్నారు. ఇలా.. అనేక మంది నాయకులు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్ తనకు ఎప్పటినుంచో ఆదరిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం సహా.. ఈ సారి కామారెడ్డి నియోజకవర్గాల్లో ఈ సారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గెలుపుపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ రెండు చోట్లా ఆయన గెలిస్తే.. ఎన్టీఆర్ రికార్డును తిరగరాసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates