కాంగ్రెస్‌కు పాల్వాయి కుమార్తె గుడ్ బై.. రీజ‌న్ అదే!

తెలంగాణ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్ర‌వంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గ‌త కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆమె అల‌క‌బూనారు. ఈ క్ర‌మంలో కీల‌క నేత‌లు ఆమెను బుజ్జ‌గిస్తార‌నే చ‌ర్చ సాగింది. కానీ, ఎవ‌రూ పాల్వాయి స్ర‌వంతిని ప‌ట్టించుకోలేదు.

దీంతో ఆమె పార్టీ మారేందుకు స‌న్నాహాలు చేసుకున్నారు. దీనిపై బ‌హిరంగంగానే చ‌ర్చ‌కు పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ నేత‌లు ఆమెను ప‌ట్టించుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో తాఆజ‌గా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె రెండు పేజీల మేర‌కు రిజైన్ లెట‌ర్ రాశారు. పార్టీలో త‌న తండ్రి ఎప్ప‌టి నుంచి సేవ‌లు అందించారు. తాను పార్టీ కోసం ఎలాక‌ష్ట‌ప‌డిందీ ఆమె వివ‌రించారు. అంతేకాదు.. మునుగోడులో ఉద్దేశ పూర్వ‌కంగా నే కొంద‌రు త‌న‌ను ఓడించార‌ని ఆమె విమ‌ర్శించారు.

కాగా.. తాజాగా ఆమె బీఆర్ ఎస్ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌త ఏడాది జ‌రిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో పాల్వాయి స్ర‌వంతి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. అయితే.. ఆ ఎన్నిక‌లోఆమె ఓడిపోయారు. ఇదిలావుంటే, మునుగోడు ఉప ఎన్నిక‌కు కార‌ణమైన కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి.. తిరిగి కాంగ్రెస్‌లోకి రావ‌డం, ఆ వెంట‌నే ఆయ‌న‌కు ఈ సీటును ఖ‌రారు చేయ‌డం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే స్ర‌వంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్ప‌డం గ‌మ‌నార్హం.