ఇసుక కేసులో చంద్రబాబుకు ఊరట

ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఈ 28వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

ఈ రోజు ఉదయం విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని పాస్ ఓవర్ కోరారు. దీంతో, ఈ రోజు మధ్యాహ్నం పిటిషన్ ను విచారణ జరిపారు. విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు తరఫు లాయర్లు అన్నారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.

కాగా, చంద్రబాబు హయాంలో ఇసుక పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.