‘నాట్ బిఫోర్ మీ’- ఈ మాట ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల వరకు కూడా.. న్యాయ మూర్తులు పలు కేసుల విచారణ నుంచి దూరం జరుగుతున్నారు. గతంలో ఆయా కేసులకు సంబందించిన పిటిషనర్ల తరఫున వీరు న్యాయ వాదులుగా వాదించడమో.. లేక గతంలో ఈ కేసులను న్యాయమూర్తులగా ఉండి విచారణ చేయడమో.. నేపథ్యంలో న్యాయమూర్తులు ఇలా నాట్ బిఫోర్ మీ అనే ఫార్ములాను వినియోగిస్తున్నారని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఏపీ హైకోర్టు సీఎం జగన్‌కు సంబంధించిన ఓ కేసులో న్యాయమూర్తి ఇలానే తప్పుకొన్నారు. ఏపీ సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. జగన్‌కు, ఆయన కుటుంబానికి, బందుగణానికి లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుందని దీనివల్ల ప్రజాధనం తరిగిపోతోందని ఆరోపిస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ తాజాగా మంగళవారం విచారణకు వచ్చింది.
అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు.. నాట్ బిఫోర్‌మీ అంటూ.. వైదొలిగారు. ఈ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేసేలా ప్రధాన న్యాయమూర్తికి సూచించాలని ఆయన రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణ వేరే బెంచ్‌కు బదిలీ కానుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో ఓటర్ల అవకతవకలకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలోనూ ఇలానే జరిగింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు. గతంలో ఈయన ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం గమనార్హం.