బీజేపీకి పూర్తి మద్దతిస్తాం: పవన్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో నేడు జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని, బిజెపికి తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా బీసీని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించడాన్ని పవన్ స్వాగతించారు.

అలా ప్రకటన చేయడానికి ధైర్యం కావాలని,, సామాజిక తెలంగాణ, బీసీ తెలంగాణకు తాను పూర్తి మద్దతిస్తున్నానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ వచ్చినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అని ప్రశ్నించారు. సకలజనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందని, జల్, జంగల్, జమీన్ అని కొమురం భీం పోరాడారని గుర్తు చేశారు. ఎన్నికల స్టంట్ కోసం ప్రధాని మోడీ ఏదీ చేయలేదని, అలా అయితే ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు వంటివి వచ్చేవి కాదని చెప్పారు.

మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఉగ్ర దాడులు తగ్గాయని అన్నారు. అంతర్జాతీయంగా భారత్ ను ప్రధాని అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి మోడీ అని, అలాంటి ప్రధానికి అండగా ఉంటామని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని పవన్ నినదించారు.