తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. అందుకు కలిసొచ్చే ఏ చిన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ వదలడం లేదు. పార్టీకి లాభం అవుతుందనకునే విషయంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. అది నేతల చేరికలైనా, టికెట్ల కేటాయింపు అయినా. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ వీళ్లలో చాలా మంది టికెట్లు కేటాయించింది. ఇప్పుడు ఎంఐఎం కీలక నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలిసింది.
చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొనసాగుతున్నారు. 1994 నుంచి 2014 వరకూ యాకుత్ పురా నుంచి ఆయన వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో చార్మినార్ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. కానీ ఈ సారి ఈ సీనియర్ నాయకుడికి మజ్లిస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన సేవలను పార్టీ పరంగా ఉపయోగించుకుంటామని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో అహ్మద్ ఖాన్ తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
చార్మినార్ టికెట్ దక్కని అహ్మద్ ఖాన్ ను తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన మూడో జాబితాలోనూ చార్మినార్ సీటు ఎవరికి కేటాయించకుండా వదిలేసింది. ఒకవేళ అహ్మద్ ఖాన్ పార్టీలోకి వస్తే ఆయనకు ఆ సీటు ఇచ్చే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి.. ఆ పార్టీ తరపున అహ్మద్ ఖాన్ బరిలో దిగుతారేమో చూడాలి.