ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో కేసీయార్ కు కొత్త తలనొప్పి మొదలైందట. ఇంతకీ ఆ కొత్త తలనొప్పి ఏమిటంటే నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు, ఇన్చార్జీలకు ఏమాత్రం పడటంలేదట. అభ్యర్ధుల ప్రచారం తీరుతెన్నులను దగ్గర నుండి పరిశీలిస్తు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కేసీయార్ ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్ ను నియమించారు. అలాగే అభ్యర్ధులకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య సమన్వయం చేయటం, ఎన్నికల ప్రచారం స్మూత్ గా జరిపించటం కూడా అబ్జర్వర్లు(ఇన్చార్జిల) బాధ్యతే.
ఇపుడు చాలా నియోజకవర్గాల్లో ఈ ఇన్చార్జిలే అభ్యర్ధులకు పెద్ద సమస్యగా తయారయ్యారట. ఎలాగంటే ఎన్నికల తేదీ దగ్గరకు వస్తోంది, నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. కాబట్టి అభ్యర్ధులందరు డబ్బులు ఖర్చు చేయాలని, చేస్తారని ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ ఎదురు చూస్తున్నారు. అయితే అభ్యర్ధులేమో డబ్బుల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించటంలేదట. నిజానికి ఎన్నికలంటేనే డబ్బుమయం అన్న విషయం అందరికీ తెలిసిందే. నామినేషన్లు వేస్తున్నా అభ్యర్ధులు డబ్బులు తీయకపోవటంతో చాలామందికి మండిపోతోందట.
ఇదే విషయాన్ని ఇన్చార్జిలతో ద్వితీయ శ్రేణి నేతలు ఫిర్యాదులు చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఇన్చార్జిలు అభ్యర్ధులతో ప్రస్తావిస్తున్నారట. దాంతో అభ్యర్ధుల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోందట. ఎందుకంటే ఇప్పటినుండే డబ్బులు ఖర్చులు పెట్టాలంటే చాలామంది అభ్యర్దుల వల్లకాదు. మెల్లిగా అవసరానికి తగ్గట్లుగా డబ్బులు తీస్తుంటారు. మామూలుగా అయితే ముందు పార్టీ ఇచ్చే డబ్బు, తర్వాత విరాళాలు ఆ తర్వాతే సొంత డబ్బు ఖర్చులు చేస్తుంటారు. అలాంటిది మొదటినుండే డబ్బులు ఖర్చులు చేయాలని అభ్యర్ధులను ఇన్చార్జిలు అడుగుతుండటంతో వీళ్ళల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది.
అందుకనే ఇన్చార్జిలపైన కొందరు అభ్యర్ధులు కేసీయార్ కు ఫిర్యాదులు చేస్తున్నారట. ద్వితీయ శ్రేణి నేతలను డబ్బుల కోసం ఇన్చార్జిలే తమపై ఉసిగొల్పుతున్నారని ఫిర్యాదుల్లో చెబుతున్నారట. దాంతో ఇద్దరిలో ఎవరు చెబుతున్నది కరెక్టో తేల్చుకోలేక కేసీయార్ తల పట్టుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు ఇతర నేతలకు సమన్వయం చేస్తారని ఇన్చార్జీలను నియమిస్తే వాళ్ళే చాలాచోట్ల అభ్యర్ధులకు సమస్యగా తయారైతే ఇక ఎవరేమి చేయాలి ? ఇపుడీ సమస్యను ఎలా పరిష్కరించాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదట.