మంత్రి మల్లారెడ్డి.. తన డైలాగ్ లు, మాటలతో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. లీడర్ గానే కాదు సెలబ్రిటీగానే మారారు. ఇదే జోరులో వరుసగా రెండో ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా సాగుతున్నారు. మేడ్చల్ నుంచి మరోసారి బరిలో దిగిన మల్లారెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తాజాగా ప్రచారంలో భాగంగా తన దగ్గర మస్తు పైసలున్నాయని మల్లారెడ్డి పేర్కొన్నారు. కానీ తాను ఎగిరి పడనని ఆయన చెప్పారు. నడిమంత్రపు సిరి రాగానే కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఎగిరెగిరి పడుతున్నారని మల్లారెడ్డి విమర్శించారు. తాను ప్రజల్లో ఉంటానని, ప్రజల మనిషినని మల్లారెడ్డి తెలిపారు. బంగారం లాంటి జంగయ్య యాదవ్ పేరును ఆయన వజ్రేష్ యాదవ్ గా మార్చుకున్నారని మల్లారెడ్డి విమర్శించారు. దీంతో ఆయన్ని ప్రజలెవరూ గుర్తుపట్టడం లేదంటూ ఎద్దేవా చేశారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఆయన ఫీల్ అవుతున్నారని, మధ్యలో డబ్బు వస్తే ఇలాగే ఉంటుందని మల్లారెడ్డి ఫైర్ అయ్యారు.
తన దగ్గర మస్తు పైసలున్నాయని, కానీ తాను వజ్రేష్ లాగా పేరు మార్చుకోలేదని మల్లారెడ్డి చెప్పారు. విద్యా సంస్థలు, ఇతర వ్యాపారాల ద్వారా మల్లారెడ్డి భారీగా సంపాదిస్తున్నారని, ఆయన అవినీతిపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో మేడ్చల్ లో తాను గెలవడంతో పాటు మల్కాజిగిరి నుంచి తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకునే ప్రయత్నాల్లో మల్లారెడ్డి బిజీ అయ్యారనే చెప్పాలి.