బెజ‌వాడ తూర్పుకు సెగ‌పెడితే.. అవినాష్‌కు పెద్ద డ్యామేజ్‌..!

విజ‌య‌వాడ‌లో టీడీపీ బ‌లం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం తూర్పు కాన్సిట్యుయెన్సీ. ఈ సెగ్మెంట్ ప‌రిధిలో ప్ర‌జ‌లు టీడీపీకే వ‌రుస‌గా జై కొడుతున్నారు. 2014లో ఇక్క‌డ నుంచి టీడీపీ విజ‌యం ద‌క్కించు కుంది. త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపించినా.. ఇక్క‌డ మాత్రం టీడీపీనే తిరిగి సీటు ద‌క్కించుకుంది. గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌రుస‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కుతున్నా రు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఇక్క‌డ పాగావేయాల‌న్న‌ది వైసీపీ వ్యూహం.

ఈ క్ర‌మంలోనే బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న దేవినేని అవినాష్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించే ఆలోచ‌న‌లో వైసీపీ ఉంది. దీంతో ఆయ‌న‌కు ఎప్ప‌టి నుంచో ఇక్క‌డ ఫ్రీహ్యాండ్ ఇస్తున్నారు. ఆయ‌న కూడా కార్య‌క్ర‌మాల్లో దూకుడుగా ఉన్నారు. నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌తోనూ మంచి రేపో మెయింటెన్ చేస్తున్నారు.

ఇలా.. దేవినేని దూకుడు బాగున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. పార్టీ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన ముసాయిదా ఓట‌ర్ల జాబితాలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్ల‌ను సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోకి బ‌దిలీ చేయ‌డం.. అధికార పార్టీ విజ‌యానికి భారీ అడ్డంకిగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది.

తూర్పు ప‌రిధిలోని కృష్ణ‌లంక‌, రాణీగారి తోట‌, ప‌శువుల ఆసుప‌త్రి ప‌రిధిలో ఉన్న దాదాపు 22 వేల మంది ఓట‌ర్ల‌ను సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి చేర్చారు. మ‌రి ఇది ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? అనేది తెలియ‌క‌పోయినా.. దీంతో వైసీపీ విజ‌యావ‌కాశాలు మాత్రం స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌నే హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా దూకుడుగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ టీడీపీకి చెక్ పెట్టేందుకు తూర్పు నుంచి ఓట్ల‌ను బ‌దలాయించార‌నే చ‌ర్చ సాగుతోంది. కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల‌..తూర్పులో యువ నాయ‌కుడైన అవినాష్ విజ‌యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు బ‌దిలీ అయిన ఆయా ప్రాంతాల్లో అవినాష్‌కు ప‌ట్టు ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో బ‌దిలీ అయిన ఓట్ల వ్య‌వ‌హారంలో ఎవ‌రి ప్ర‌మేయం ఉంద‌నే విష‌యంపై ఆయ‌న కూపీలాగుతున్న‌ట్టు స‌మాచారం.

దీనిని స‌రిచేసేందుకు యువ నేత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏదేమైనా.. తూర్పులో టీడీపీకి చెక్ పెట్టాల‌నే వ్యూహంతో వైసీపీ త‌న ను తానే దెబ్బ‌తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.