ఏపీలో విద్యావ్య‌వ‌స్థ‌కు అంత‌ర్జాతీయ ప్ర‌శంస‌లు

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సీఎం జ‌గ‌న్ విద్యావ్య‌వ‌స్థ‌లో స‌మూల ప్ర‌క్షాళ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశం పెట్ట‌డం నుంచి డ్రాపౌట్లు లేకుండా చూసేందుకు అమ్మ ఒడి వంటి కీలక నిర్ణ‌యాలు తీసుకుని ఖ‌ర్చుకు వెనుకాకుండా ముందుకు సాగుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఏళ్ల త‌ర‌బ‌డి మ‌ట్టి కొట్టుకుపోయి న పాఠ‌శాల‌ల‌కు కొత్త రూపు ఇస్తూ.. కార్పొరేట్ త‌ర‌హాలో పాఠ‌శాల‌లను తీర్చిదిద్దేందుకు నాడు-నేడు వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా అమ‌లు చేస్తున్నారు. ఇక‌, విద్యార్థుల‌కు షూస్ నుంచి బ్యాగుల వ‌ర‌కు పుస్త‌కాల నుంచి యూనిఫాం వ‌ర‌కు అన్నింటినీ ఉచితంగా ఇస్తూ.. పేద విద్యార్థులు కూడా ఆనందంగా విద్య‌ను అభ్య‌సించేలా కృషి చేస్తున్నారు.

ఇలా.. జ‌గ‌న్ స‌ర్కారు రాష్ట్ర విద్యావ్య‌వ‌స్థ‌లో తీసుకువ‌స్తున్న స‌మూల మార్పులు, ప్ర‌క్షాళ‌న‌ల‌కు దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఫిదా అయిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ ప్ర‌భుత్వం త‌ర్వాత‌.. ఆ రేంజ్‌లో ఏపీలో స‌మూల మార్పుల దిశ‌గా అడ‌గులు వేస్తున్నారు. ఇలా..ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఏపీలో చేప‌డుతున్న విద్యా సంస్క‌ర‌ణ‌లు, అమ్మ ఒడి, నాడు-నేడు, ఆంగ్ల మాధ్య‌మం బోధ‌న‌, స్కూళ్ల రేష‌న‌లైజేష‌న్ వంటి అంశాలపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా నెదర్లాండ్స్ లోని యుట్రెచ్ట్ లో జరుగుతున్న ‘గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్-2023లో ఏపీపై ప్ర‌శంసల జ‌ల్లు కురిసింది.

ఈ స‌ద‌స్సుకు భారతదేశ ప్రతినిధిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ హాజ‌రై.. ఏపీలో చేప‌ట్టిన విద్యాసంస్క‌ర‌ణ‌లను వివ‌రించారు. ప్యానెల్ చర్చలో ఈజిప్ట్, బుర్కినాఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్తో పాటు భారత్ తరఫున పాల్గొన్న సురేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణలు, సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివ‌రించారు. విద్యారంగంలో ‘ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది’ అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. బదులిస్తూ ‘ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతమైన ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యా శాఖాధికారులు, డీఎస్వోలతో పాటు భాగస్వామ్య సంస్థలైన అటౌన్ ఇంటర్నేషనల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్ సహకారంతో సాధ్యమైం ద’ని చెప్పారు. అనంతరం అయన యునిసెఫ్, ది గ్లోబల్ ఫైనాన్షి యల్ లిట్రసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు.

ఇదే తొలిసారికాదు!
సీఎం జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలోని విద్య వ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలపై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు.

ఏపీ నుంచి వెళ్లిన 10 మంది విద్యార్థులు 15 రోజులపాటు కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే వేదిక‌గా ఏపీ విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలను వివరించారు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ స్థాయిలో మేధావులు, నిపుణులు, విద్యావేత్త‌లు ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌డం గ‌మ‌నార్హం.