సాయిరెడ్డి వ‌ర్సెస్ పురందేశ్వ‌రి: ఏపీ బీజేపీ పిన్ డ్రాప్ సైలెన్స్‌!!

ఏపీ రాజ‌కీయాల్లో గ‌త నాలుగైదు రోజులుగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక్కం విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇవి మామూలుగా కూడా కాదు.. భారీ రేంజ్‌లోనే ఉండ‌డం.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా దారితీశాయి. ఏకంగా సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు కోరుతూ.. ప‌రందేశ్వ‌రి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌డం మ‌రింత సంచ‌ల‌నం సృష్టించింది.

అదేస‌మ‌యంలో సాయిరెడ్డి కూడా.. పురందేశ్వ‌రిని తీవ్ర‌వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించారు. పురందేశ్వ‌రికి మందు కొట్టే అల‌వాటు ఉందేమోన‌ని అన్నారు. బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉంటూనే.. టీడీపీకి అన‌ధికార అధ్య‌క్షురాలిగా ఉంటూ.. బావ‌గారిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సాయిరెడ్డి దుయ్య‌బ‌ట్టారు. మొత్తంగా ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్నప్ప‌టికీ.. ఏపీ బీజేపీ నాయ‌కులు పెద్ద‌గా రియాక్ట్ కాక‌పోవ‌డం.. పురందేశ్వ‌రికి మ‌ద్ద‌తుగా ఏ ఒక్క‌రూ ప్రెస్ మీట్ పెట్ట‌డం వంటివి ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. మ‌రి ఆమె విష‌యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు అసంతృప్తితో ఉన్నారా? లేక ఏం జ‌రుగుతోంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎక్క‌డ మొద‌లైంది వివాదం?

సాయిరెడ్డి వ‌ర్సెస్ పురందేశ్వ‌రి మ‌ధ్య వివాదం.. లిక్క‌ర్ విష‌యం నుంచి ప్రారంభ‌మైంది. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టాల‌న్న ప్ర‌తిప‌క్ష బీజేపీ వ్యూహంలో భాగంగా ప‌లు అంశాల‌పై పురందేశ్వ‌రి త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న మ‌ద్యం విధానాన్ని ఆమె ఎండ‌గ‌ట్టారు. లిక్క‌ర్ ర‌హితం చేస్తామ‌న్న జ‌గ‌న్.. దాని ఆదాయంపైనే ముందుకు సాగుతున్నారంటూ..ఆ మె వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డి, మ‌రో ఎంపీ మిథున్ రెడ్డిల పాత్ర లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఉంద‌ని.. వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని.. దీనిపై కేంద్రం జోక్యం చేసుకుని విచార‌ణ‌కు ఆదేశించాల‌ని పురందేశ్వ‌రి కేంద్రానికి లేఖ రాశారు. ఈ విష‌యాన్ని ఆమె మీడియా ముందే చెప్పారు. ఇక‌, ఈ ప‌రిణామంతో తెర‌మీదికి వ‌చ్చిన సాయిరెడ్డి.. ప్ర‌కాశం జిల్లాలో నిర్వ‌హించిన బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వ‌రిపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. తాను మ‌ద్యం ముట్ట‌న‌ని.. పురందేశ్వ‌రికి మ‌ద్యం తాగే అల‌వాటుందేమో.. అందుకే ఆమెకు లెక్కలు బాగా తెలుస్తున్నాయ‌ని ఎద్దేవా చేశారు. ఆధారాలు ఉంటే ముందుకు రావాల‌ని స‌వాల్ రువ్వారు. అంతేకాదు.. గ‌తంలో కాంగ్రెస్‌లో ఇప్పుడు బీజేపీ లో ఉంటూ.. కేరాఫ్ లేకుండా రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అన్నారు.

సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఒక‌రిద్ద‌రు బీజేపీ చోటా నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చి.. పురందేశ్వ‌రి మందు కొట్టే వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. క్ష‌మాప‌ణ‌లు కోరారు. అయితే.. దీనిపై సాయిరెడ్డి స్పందించ‌లేదు. ఇంతలో పురందేశ్వ‌రి మ‌ళ్లీ రెచ్చిపోయి.. అస‌లు అక్ర‌మ కేసులు అవినీతి కేసుల్లో ఉన్న సాయిరెడ్డి బెయిల్‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ ప‌రిణామం సాయిరెడ్డిని మ‌రింత ఉడికించింది.

దీంతో ఆయ‌న టీడీపీ కోసం ప‌నిచేస్తున్నార‌ని.. గ‌తంలో తండ్రి ఎన్టీఆర్‌ను అవ‌మానించిన కాంగ్రెస్‌లో చేరి మంత్రి ప‌ద‌వి పొందార‌ని, ఇప్పుడు బీజేపీలో ఉన్నా.. మ‌న‌సు మాత్రం టీడీపీలోనే ఉంద‌ని.. ఆమెకు నీతి లేని చ‌రిత్ర సొంత మ‌ని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతున్నా.. ఏపీ బీజేపీ మాత్రం పిన్‌డ్రాప్ సైలెంట్ అయిపోయింది. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం పురందేశ్వ‌రికి సంఘీభావంగా కీల‌క నాయ‌కులు ఎవ‌రూ రోడ్డు మీద‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.