ఎంఐఎం ఎందుకు పోటీచేస్తోంది ?

తాజాగా ఎంఐఎం పోటీపై రాజకీయాపార్టీల్లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. మామూలుగా అయితే ఓల్డ్ సిటీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఎంఐఎం పోటీచేస్తుంటుంది. విస్తరణ విషయమై ఎన్నిసార్లు ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా, ఒత్తిళ్ళు వచ్చినా ఓల్డ్ సిటీ దాటి ఎంఐఎం పోటీచేసింది లేదు. రాష్ట్రంలోని 20 నియోజకవర్గాల్లో అంటే ముస్లింల ప్రాబల్యమున్న కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీచేస్తుందని అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గతంలో ప్రకటించారు. అయితే మళ్ళీ ఆ విషయమై ఎక్కడా ప్రస్తావించింది లేదు ప్రయత్నాలు చేసిందీ లేదు.

అలాంటిది సడెన్ గా ఓల్డ్ సిటీలోని ఏడు నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నది. కొత్తగా రెండు నియోజకవర్గాలు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లో ఎందుకు పోటీచేయాలని ఎంఐఎం అనుకున్నదో అర్ధంకావటంలేదు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అన్న విషయం తెలిసిందే. అందుబాటులోని సమాచారం ఏమిటంటే కొత్త పోటీకి రెండు కారణాలు కనబడుతున్నాయి.

అవేమిటంటే మిత్రపక్షం బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీ కంటెస్టుకు ఎంఐఎం రెడీ అవుతోందట. అలాగే బీఆర్ఎస్ ను గెలిపించేందుకే ఎంఐఎం అభ్యర్ధులను దింపుతోందనే ప్రచారం మొదలైపోయింది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం అభ్యర్ధుల మీద బీఆర్ఎస్ అభ్యర్ధులు ఫ్రెండ్లీకంటెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఎంఐఎం నుండి కూడా బీఆర్ఎస్ పై ఫ్రెండ్లీకంటెస్టు మొదలైందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధుల మీద బాగా వ్యతిరేకత కనబడుతోందట.

ఆ వ్యతిరేకత మొత్తం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయితే బీఆర్ఎస్ అభ్యర్దులు ఓడిపోతారని సర్వేలో బయటపడిందట. అందుకనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడకుండా ముందుజాగ్రత్తగానే ఎంఐఎం కొత్తగా అభ్యర్ధులను పోటీలోకి దింపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అంటే కొత్తగా రెండు నియోజకవర్గాల్లో పోటీకి ఎంఐఎం దిగుతోందని మాటే కానీ అది బీఆర్ఎస్ ను గెలిపించేందుకే అనే ప్రచారం మొదలైంది. దీంతో ఎంఐఎం పోటీ ఫ్రెండ్లీకంటెస్టేనా లేకపోతే ఓట్లను చీల్చి బీఆర్ఎస్ కు లబ్దిచేకూర్చటానికేనా అన్నది చూడాలి.