కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఐ కూడా గుడ్ బై చెప్పేస్తుందా ? రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐకి పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ అంగీకరించింది. సీపీఎం అడిగిన రెండుసీట్లు వైరా లేదా పాలేరు, మిర్యాలగూడెం సీట్లపైనే వివాదం కంటిన్యు అవుతోంది. ఎన్నిరోజులైనా పొత్తును కాంగ్రెస్ ఫైనల్ చేయకపోవటంతో పాటు గతంలో ఇస్తామని ప్రతిపాదించిన సీట్లపైన కూడా తాజాగా వెనక్కు తగ్గిందని సీపీఎం ఆరోపించింది.
కాంగ్రెస్ వైఖరి నచ్చకపోవటంతో పొత్తును తెంచుకున్నట్లు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. అలాగే తమ పార్టీ పోటీచేయబోయే 17 నియోజకవర్గాల జాబితాను కూడా ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీపీఐ నిర్ణయంతో తమకు సంబంధంలేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తుంటే సీపీఐ పోటీచేయబోయే రెండుసీట్లలో తమ పార్టీ పోటీచేయదని కూడా చెప్పారు. అయితే సీపీఎం నిర్ణయం నేపధ్యంలో సీపీఐ కూడా పునరాలోచిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ తో పొత్తుంటే రెండుపార్టీలూ ఉండాలని లేకపోతే రెండుపార్టీలు విడిగానే పోటీచేయాలనే ఆలోచనలో సీపీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు లేకపోతే రెండు పార్టీలు ఐక్యంగా పోటీచేస్తాయనటంలో సందేహంలేదు. ఇప్పటికే సీపీఎం పార్టీ 17 నియోజకవర్గాలను ప్రకటించేసింది. కాబట్టి కాంగ్రెస్ తో పొత్తులేకపోతే సీపీఐ కూడా ఓ 15 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు శుక్రవారం సమావేశం పెట్టుకున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సొంతంగా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచేంత సీన్ కమ్యూనిస్టు పార్టీలకు లేదు. అయితే గెలుస్తారని అనుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో ఒకరిని ఓడగొట్టేందుకు మాత్రం పనికొస్తాయి. అందుకనే కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కాకపోతే సీట్లపంపకాల్లో తేడా రావటంతోనే ఏ విషయం తేల్చుకోలేకపోతోంది. మరి ఈ విషయాన్ని ఎంత తొందరగా కాంగ్రెస్ తేల్చుకుంటే అంతమంచిది.