టీడీపీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో అరెస్టు చేసి దాదాపు 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ లో ఉండగానే ఆయనపై ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేసు పెట్టారు. స్కిల్ కేసుకు ముందే నమోదైన అంగళ్లు అల్లర్ల కేసు ఇందుకు అదనం. ఇక, బెయిల్ పై చంద్రబాబు విడుదల కావడానికి ఒక్క రోజు ముందు మద్యం షాపుల అనుమతులలో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుపై మరో కేసు పెట్టారు.
ఇక, తాజాగా చంద్రబాబు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా ఈ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలలో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఈ ప్రకారం ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబులను పేర్కొనగా..ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమలను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు దాదాపు 10 వేల కోట్ల రూపాయల నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఏది ఏమైనా చంద్రబాబుపై ప్రభుత్వం, సీఐడీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.