తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమలలో ఇష్టానుసారం నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పార్వతీ మంటపాన్ని తొలగించి యథావిధిగా నిర్మిస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేశారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే తరహాలో అలిపిరి మంటపం కూడా తొలగిస్తామని చెబుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి 75 సంవత్సరాల పైబడిన మంటపాలను తొలగించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి అని, వారి పర్యవేక్షణలోనే మంటపాలను తొలగించాలని అన్నారు.
అలిపిరి మంటపం 500 సంవత్సరాల కంటే ముందే నిర్మించారని, దానికి మరమ్మతులు చేయాలన్నా, పునర్నిర్మాణం చేయాలన్న పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి అని గుర్తు చేశారు. ధార్మిక వ్యవహారాలలో ఇష్టారీతిన వ్యవహరిస్తే బిజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇటువంటి కార్యక్రమాలను ఆపివేయకుంటే ప్రతిఘటిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తిరుమలలో అలిపిరి మంటపాన్ని సందర్శించిన నేపథ్యంలో పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, పురందేశ్వరిపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సంస్థాగతంగా బిజెపిని ఫణంగా పెట్టి మీ సామాజిక వర్గ కుటుంబ పార్టీ టీడీపీని బలోపేతం చేసేందుకు తపిస్తున్నావా పురందేశ్వరిపై సాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ సంగతి ఢిల్లీ పెద్దలకు తెలుసులే చెల్లెమ్మా అంటూ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను గతంలో దోచుకునే వారని, ఇప్పుడు సహజ వనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నావు చెల్లెమ్మా అని చురకలంటించారు.