సీఎం కేసీఆర్.. బీఆర్ ఎస్ ముఖ్య నేతలు.. తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. “స్పైవేర్‌ని ఉపయోగించి మా ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారు. ఇది గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. కానీ ఏదీ మనల్ని అడ్డుకోదు. మా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాం. కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రాధాన్యత ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడడమే. తెలంగాణ ప్రజల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నాం” అని రేవంత్‌రెడ్డి ట్విట్ చేశారు.
ఇదిలావుంటే, రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. “తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారు” అని పరోక్షంగా రేవంత్పై ఆయన విరుచుకుపడ్డారు. కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారని అన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారని… కానీ 50 ఏళ్లలో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల పంచాయతీలు ఢిల్లీలో జరుగుతాయని.. అలాంటి నాయకులు మనకు అవసరమా అని మంత్రి అన్నారు. రాష్ట్రం కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేశారని, కుటుంబాన్ని కూడా కాదనుకుని.. తెలంగాణ సమాజాన్నే తన కుటుంబంగా చేసుకున్నారని.. ప్రాణత్యాగానికి కూడా రెడీ అయ్యారని.. మరోసారి కేసీఆర్‌ను గెలిపించుకోవడం తెలంగాణ సమాజం బాధ్యతని కేటీఆర్ చెప్పుకొచ్చారు.