కేసీయార్ పాలనతో పాటు అధికార పార్టీలోని లోపాలను, తప్పులను ఉతికి ఆరేయటంలో తీన్మార్ మల్లన్న బాగా పాపులరయ్యారు. తన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి రోజు కేసీయార్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై మల్లన్న విరుచుకుపడుతుంటారు. తీన్మార్ మల్లన్న దాడులను తట్టుకోలేక ప్రభుత్వం చాలా కేసులను పెట్టింది. తనపై ఎన్ని కేసులను పెట్టినా మల్లన్న ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. ఈ కారణంగానే జనాల్లో పాపులారిటి పెరిగింది. ఆమధ్య జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చిన ఓట్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దాదాపు గెలుపు అంచుల వరకు వచ్చారు.
దాంతోనే మల్లన్న పాపులారిటి చాలామందికి అర్ధమైంది. ఇపుడీ అంశాన్నే కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నది. అందుకనే మల్లన్నకు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణా జన సమితి అన్నది తీన్మార్ మల్లన్న పార్టీ. ఆ పార్టీతో పొత్తు లేకుండానే మల్లన్నకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగానే సిరిసిల్ల, కరీనంగర్, కామారెడ్డిలో ఎక్కడా పోటీచేసినా పార్టీ తరపున అభ్యర్థిని పెట్టకుండా తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలబడతామని కాంగ్రెస్ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చిందట.
సిరిసిల్లలో కేటీఆర్ పోటీ చేస్తుండగా బీజేపీ నుండి రాణి రుద్రమ పోటీచేస్తున్నది. వీళ్ళిద్దరు అగ్రకులాల అభ్యర్ధులే కాబట్టి బీసీ నేత అయిన మల్లన్న రంగంలో ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ సూచించింది. ఇక కామారెడ్డిలో డైరెక్టుగా కేసీయార్ ఢీ కొట్టే అవకాశం కూడా ఇచ్చిందట. కేసీయార్ పైన పోటీ చేస్తే పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పిందట. అలాగే కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ తరపున బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు బీసీ నేతలే అయినా తీన్మార్ ను ఇక్కడ పోటీచేయమని కాంగ్రెస్ చెప్పింది.
పైగా మూడు సీట్లలో ఎక్కడ పోటీ చేసినా పర్వాలేదు కాంగ్రెస్ తరపున అభ్యర్ధిని పెట్టకుండా మద్దతిస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు ఆఫరిచ్చారు. అయితే మల్లన్న దృష్టంతా మేడ్చల్ నియోజకవర్గం మీదున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించేందుకు మల్లన్న ఢిల్లీకి వెళ్ళారు. ఒకటి రెండు రోజుల్లోనే ఏ విషయం ఫైనల్ అవుతుందని అనుకుంటున్నారు. మల్లన్న నిర్ణయం కోసమే పై మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. మరి మల్లన్న ఏమి చెబుతారో చూడాలి.